MLC Election: రెండో ప్రాధాన్యత ఓటు ఎమ్మెల్సీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందా..?
మూడు ఉమ్మడి జిల్లాల్లో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో తన గెలుపు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమకే పట్టం కడతారని, గెలుపు తమదేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు.
ఇటీవల ముగిసిన వరంగల్ – ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుందా..? ఊహించని విధంగా పోలింగ్ శాతం తగ్గడం అభ్యర్థులను కలవరపెడుతోందా..? అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఆదే బెంగ పట్టుకుందట. మొదటి ప్రాధాన్యంలో కోటా ఓటు ఎవరికీ రాదనే అంచనా వేసుకుంటున్నారట. ద్వితీయ ప్రాధాన్య ఓటుతోనే ఫలితం తేలుతుందని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో గెలుపోటములో రెండో ప్రాధాన్యత ఓటే కీలకం కానుందా ? గత ఎన్నికల ఫలితాలను అభ్యర్థులు విశ్లేషించుకుంటున్నారట. ఇంతకీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పట్టుకున్న టెన్షన్ ఏంటి..?
బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం
వరంగల్ – ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 72.37 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రులు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ఆసక్తి రేపుతోంది. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం ప్రకారం అభ్యర్థులు లెక్కలను బేరీజు వేసుకుంటూ ఎక్కడ అనుకూలంగా ఉందనేది అనుచరులు, కార్యకర్తల ద్వారా తెలుసుకుని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హోరాహోరీగా సాగిన పోరు..
మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీచేసినా, ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), ఏనుగు రాకేశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి (బీజేపీ) నడుమే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాధారణ ఎన్నికలను తలపించింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ అగ్ర నేతలందరినీ ప్రచారంలోకి దించి హోరాహోరీగా తలపడ్డాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. 2021 ఎన్నికల్లో 76.73శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 72.37 శాతం పోలింగ్ నమోదైంది. తగ్గిన పోలింగ్ శాతం లాభమా.. నష్టమా.. అనే దానిపై అభ్యర్థులు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు.
సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ కోట్ల లెక్కింపు
సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ కోట్ల లెక్కింపు ఉంటుంది. పోలైన ఓట్లలో 50 శాతం దాటి ఒక్క ఓటు అదనంగా వస్తేనే విజేతగా ప్రకటిస్తారు. అయితే ఈసారి మొదటి ప్రాధాన్యంలో గెలుపు కోటా ఓటు ఎవరికీ రాదనే అంచనా అభ్యర్థులు వేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలదని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. గత మూడు సార్లు జరిగిన పట్టభద్రుల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. రెండో ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలింది. దీంతో ఈసారి మొదటి ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కే పరిస్థితి లేదని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓటు కీలకం కానుందని అంతా అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు పట్టభద్ర ఓటర్లుకు సుపరిచితులే కావడంతో మొదటి ప్రాధాన్య ఓట్లు అధికంగా ఎవరికి పడ్డాయి? రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి వస్తాయనే దానిపై చర్చ సాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓటుపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుందా..?
మొదటి ప్రాధాన్యత ఓటుతో కోటా ఓటు రాకపోతే.. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లను బదలాయిస్తారు. పోలైన ఓట్లతో సగానికంటే ఒక ఓటు అదనంగా వచ్చే వరకు ప్రాధాన్యత ఓట్లను బద్దలాయిస్తుంటారు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటు అభ్యర్థుల్లో టేన్షన్ పుట్టిస్తోంది. పట్టభద్రులు రెండో ప్రాధాన్యత ఓటును ఎవరికి వేశారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉప ఎన్నిక సమరం మాత్రం ప్రధాన పార్టీల మధ్యనే జరిగిందనేది చర్చ జరుగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో వార్ వన్ సైడ్ ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనిందనే చర్చ జరుగుతోంది. ద్వితీయ ప్రాధాన్య ఓట్లే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్నాయి. దీంతో తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డిల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ఒకే రీతిలో ఓటింగ్
మూడు ఉమ్మడి జిల్లాల్లో ఒకే రీతిలో ఓటింగ్ జరగలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిల మధ్య మొదటి ప్రాధాన్యత ఓట్లు తేడా స్వల్పంగా ఉంటే రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో ప్రాధాన్యత ఓటు పైనే పడింది. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల పొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్లగొండ, ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు భారీగానే వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు.. బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే పట్టభద్రులందరూ ద్వితీయ ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేసే అవకాశం ఉందని రాజకీయం పరిశీలన భావిస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత కీలకంగా మారింది. పట్టబదుల రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారు అనేది ఇప్పుడు అభ్యర్థులను టెన్షన్ కు గురిచేస్తుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలిపోతే మాత్రం అభ్యర్థులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరిగా ఉండే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!
మూడు ఉమ్మడి జిల్లాల్లో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో తన గెలుపు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు తమకే పట్టం కడతారని, గెలుపు తమదేనని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు.
ఏది ఏమైనా రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం అభ్యర్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారో తెలుసుకోవాలంటే జూన్ 5 వరకు ఆగల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…