ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు.. సబ్సిడీ కోసం 500 కోట్ల కేటాయింపు.. అఖరు తేదీ ఎప్పుడంటే..

SC Corporation loans: ఎస్సీ కులాల సంక్షేమానికి, సమున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‌నాయకత్వంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని

  • uppula Raju
  • Publish Date - 6:01 am, Mon, 1 February 21
ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు.. సబ్సిడీ కోసం 500 కోట్ల కేటాయింపు.. అఖరు తేదీ ఎప్పుడంటే..

SC Corporation loans: ఎస్సీ కులాల సంక్షేమానికి, సమున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‌నాయకత్వంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై రుణాలు అందజేస్తున్నామన్నారు. ఈ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే అఖరు తేదీ ఈనెల 31తో ముగుస్తుండగా, దీనిని ఫిబ్రవరి 10వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పలు ప్రజాసంఘాలు, నిరుద్యోగ యువత విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచామని కొప్పుల వివరించారు.

ఇప్పటివరకు లక్షా 30వేల 104 దరఖాస్తులు రాగా, వీటిలో ఎక్కువ భాగం94 వేల769 మంది హార్టికల్చర్, వ్యవసాయ రంగానికి, 35 వేల335 దరఖాస్తులు రవాణా రంగానికి సంబంధించినవని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.786 కోట్లు కేటాయించగా, వీటిలో సబ్సిడీ కింద రూ.500 కోట్లు, రూ.279 కోట్లు బ్యాంకులు, రూ.7 కోట్లు లబ్ధిదారుల వాటా కింద ఉంటుందన్నారు. ముఖ్యంగా ఎస్సీలలోని పేద రైతులు వ్యవసాయ భూముల అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ లైన్లు, కనెక్షన్ల ఏర్పాటుకు కార్పొరేషన్ ద్వారా నేరుగా రుణాలు పొందవచ్చన్నారు. బ్యాంకుల సహకారంతో ట్రాక్టర్లు, సరుకు రవాణా కోసం నాలుగు చక్రాల వాహనాలు, క్యాబ్‌లు, ఆటోలు, మినీ డైరీ కింద గేదెలు, ఆవుల కొనుగోలుకు సబ్సిడీ మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ కులాలలోని పేదలు, నిరుద్యోగ యువత సకాలంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారికి జనం నుంచి ఎదురవుతోన్న విచిత్ర విన్నపం…!