Rythu Bharosa: రైతు భరోసా డబ్బుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..? క్లారిటీ వచ్చేసింది
తెలంగాణలో యాసంగి సీజన్ మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇంకా రైతు భరోసా నిధులు జమ కాలేదు. ప్రతీ ఏడాది ఈ పధకం కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. కానీ ఈ జనవరిలో నిధులు జమ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా అందలేదు.

తెలంగాణ రైతులు రైతు భరోసా డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ నవంబర్‌లోనే మొదలైనప్పటికీ ఇప్పటివరకు పెట్టుబడి సాయం ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో పెట్టుబడి కోసం నిధులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తెచ్చుకుని మరీ పంట సాగు చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు పడితే నిధుల కొరత ఉండదని, ప్రభుత్వం వెంటనే జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిధుల జమ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. సంక్రాంతికి డబ్బులు అకౌంట్లోకి విడుదల చేస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీంతో పండక్కి అకౌంట్లోకి డబ్బులు పడతాయని రైతుల ఆశించారు. కానీ నిధులు జమ కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సంక్రాంతికి డబ్బులు పడి ఉంటే రైతులు పండగు ఆనందంలో మునిగిపోయేవారు. కానీ ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది.
రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే..?
ఫిబ్రవరి లేదా మార్చిలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసే అవకాశం కనిపిస్తోంది. జనవరి చివరి నాటికి అయినా డబ్బులు అకౌంట్లోకి వస్తాయోమోనని రైతులు భావించారు. కానీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి శాటిలైట్ సర్వేనే కారణంగా తెలుస్తోంది. ఈ పథకం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పాటిస్తోంది. కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే సాయం అందించాలని చూస్తోంది. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాగు భూములను గుర్తించే ప్రక్రియ చేపడుతోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే పూర్తవ్వడానికి మరింతకొంత సమయం పట్టే అవకాశముంది. ఈ సర్వే రిపోర్ట్ వచ్చాక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి సాగు భూములను నిర్ధారించనున్నారు. దీంతో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి చాలా టైమ్ పట్టనుందని తెలుస్తోంది.
ఈ సారి వారికి కట్..?
యాసంగి సీజన్‌లో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ కానుంది. కేవలం సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం అర్హులకు మాత్రమే రైతు భరోసా అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా రైతు భరోసా నిధుల విడుదలపై చర్చ జరగలేదు. దీంతో నిధుల విడుదల ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద ప్రతీ ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
