AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: SBI బ్యాంక్‌లో ఆడిట్‌కు వచ్చిన సిబ్బంది.. ఓ బుక్‌లో రాసినవి చూడగా..

మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బీఐలో గోల్‌మాల్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐపై ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసింది. బ్యాంకులో నాలుగు రోజుల క్రితం ఆడిట్ టీం రంగంలోకి దిగడంతో బయటపడ్ట అక్రమాల భాగోతం తవ్విన కొద్ది కోట్ల లావాదేవీల స్కాంగా తేలింది.

Telangana: SBI బ్యాంక్‌లో ఆడిట్‌కు వచ్చిన సిబ్బంది.. ఓ బుక్‌లో రాసినవి చూడగా..
Representative Image
Naresh Gollana
| Edited By: |

Updated on: Aug 23, 2025 | 1:26 PM

Share

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్-2లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం ఆడిట్ టీం విచారణలో 4 కోట్ల గోల్‌మాల్ వ్యవహారం బయటపడగా.. మరింత లోతుగా ఆటిట్ చేసిన అదికారులకు కళ్లు బైర్లు కమ్మే అక్రమాల చిట్టా లభించింది. దాదాపు రూ.1.07కోట్ల నగదు, 12.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు( ఐదున్నర కిలోలు) మాయమైనట్లు గుర్తించారు ఆడిటింగ్ టీం. ఈ నగదు, నగల మాయంలో బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ కీలక నిందితుడిగా తేల్చారు. మేనేజర్ మనోహార్ రెడ్డితో కలిసి ఈ అక్రమాలకు తెరలేపినట్టు అనుమానిస్తున్నారు ఎస్బీఐ ఉన్నతాధికారులు. ఇందులో భాగంగానే నాలుగు రోజుల ఆడిట్‌లో తేడా వచ్చిన నగదు, నగల వివరాలతో పాటు అనుమానితులు పది మందిపై చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎస్బీఐ ఉన్నతాధికారులు. ఢిల్లీ టీం ఎంట్రీతో మేనేజర్ మనోహార్ రెడ్డి వ్యవహారం సైతం బయటపడినట్టుగా తెలుస్తోంది. గత ఆరు నెలలుగా ఈ గోల్‌మాల్ వ్యవహారం సాగుతున్నా.. మేనేజర్ సైలెంట్‌గా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆడిట్ రోజు నుంచి క్యాషియర్‌ రవిందర్ కనిపించకుండా పోవడం మరింత ఆందోళనకు కారణమైంది.

ఆన్ లైన్ బెట్టింగ్‌లు, ఆన్ లైన్ దందాలకు అలవాటు పడిన క్యాషియర్‌ రవిందర్ లక్కీ భాస్కర్ సినిమా‌ స్టైల్‌లో బ్యాంకులోని డబ్బును, నగలను కాజేసినట్టుగా తేలింది. ఆరు నెలలకు ముందు 50 లక్షలు తీసుకెళ్లిన రవిందర్.. ఆ మరునాడే డబుల్ డబ్బులు సంపాదించడంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌ల మాయలో పడి బ్యాంకులో తనఖా పెట్టిన కస్టమర్ల బంగారాన్ని కాజేసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరు నెలలుగా బ్యాంకు నుంచి ఇంత పెద్దమొత్తంలో నగదు, ఆభరణాలు మాయం చేయడం ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదని.. క్యాషియర్‌ రవిందర్‌కు బ్యాంక్ సిబ్బంది పూర్తి అండగా నిలబడ్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్రైమాసిక, వార్షిక ఆడిట్‌లోనూ మోసాలు బయటకు రాకుండా ఖాతాదారుల ఆభరణాలను మాయం చేశారంటే పక్కా పథకం ప్రకారమే వ్యవహారం నడిపారని భావిస్తున్నారు.

క్యాషియర్ నరిగే రవీందర్ ఖాతాదారులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం.. అధిక వడ్డీ ఇస్తానంటూ బ్యాంకుకు వచ్చిన కస్టమర్ల వద్దే లక్షల్లో డబ్బులు తీసుకోవడం.. వడ్డీ చెప్పినట్టుగానే ముట్ట చెప్పడంతో బ్యాంకుతో సంబంధం లేకుండా 20 మంది కస్టమర్ల నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా మరో కోటి రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. క్యాషియర్‌ స్థానికుడు కావడం మంచి నమ్మకస్తుడుగా కస్టమర్లను నమ్మించడంతో వారంతా నిండా మోసపోయినట్టు తెలుస్తోంది. ఈ భారీ స్కాం బయటపడటంతో ఎలాంటి ఆధారాలు లేకుండా క్యాషియర్‌ రవిందర్‌కు డబ్బులు ఇచ్చిన వారంతా ఇప్పుడు తల పట్టుకుంటున్నట్లు సమాచారం.

మరో వైపు బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం, నగదు మాయమైన విషయం తెలుసుకున్న ఖాతాదారులు నాలుగు రోజులుగా బ్యాంకు ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకు అని భారీ నమ్మకంతో సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసాతో బంగారం, నగదు దాచుకుంటే మా నెత్తిన శఠగోపం పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. అయితే మీ బంగారం, నగదుకు మాది పూచి.. మీకెలాంటి అన్యాయం జరగదు.. పూర్తి న్యాయం చేస్తామంటూ చెప్తున్నారు ఉన్నతాధికారులు.