Minister Malla Reddy: మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.4 కోట్ల నగదు సీజ్.. బాత్రూం, కిచన్‌లో కీలక డాక్యుమెంట్లను చింపిపడేసిన సంతోష్ రెడ్డి..
సంతోష్ రెడ్డి ఇంట్లో రూ.4 కోట్ల నగదుతోపాటు పలుకీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇంట్లోకి వెళ్లడంతోనే సంతోష్ రెడ్డి..

మంత్రి మల్లారెడ్డి ఆయన ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడు, వియ్యంకుడు, బంధువులు, సన్నిహితులు ఇళ్లతోపాటు వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 50 బృందాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదును నిన్న స్వాధీనం చేసుకున్న అధికారులు.. తాజాగా మరికొంత డబ్బును సీజ్ చేశారు. నిన్న మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్న త్రిశూల్ రెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుంచే సోదాలు నిర్వహించారు.
మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలోనూ రూ.2 కోట్లు సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోనూ ఐటీ బృందాలు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి.. కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు.
అటు మల్లారెడ్డికి అల్లుడు వరుసయ్యే సంతోష్ రెడ్డి ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. సంతోష్ రెడ్డి ఇంట్లో రూ.4 కోట్ల నగదుతోపాటు పలుకీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ఇంట్లోకి వెళ్లడంతోనే సంతోష్ రెడ్డి పలు కీలక డాక్యుమెంట్లను చింపి బాత్రూంలో పడేసినట్లుగా గుర్తించారు.
అయితే ఆ చినిగిన డాక్యుమెంట్లను రెట్రివ్ చేశారు ఐటీ అధికారులు. బాత్రూంలో చింపిపడేయడమే కాకుండా కొన్నింటిని కిచెన్లో చించి పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని సంతోష్ రెడ్డిని విచారిస్తున్నారు ఐటీ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
