Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన సర్కార్..
Telangana: ఎడతెగని వర్షాలతో అల్లాడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్..
Telangana: ఎడతెగని వర్షాలతో అల్లాడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని చెప్పిన మంత్రి.. ఈ వర్షాల కారణంగా ధాన్యం తడిసిందన్నారు. అందుకే రైతులకు ఇబ్బంది లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనేందుకు సర్కార్ సిద్ధమైందన్నారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం వివక్ష వైఖరి కారణంగానే ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరిగిందని, ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌పై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఖండించారు మంత్రి గంగుల. ధరణి పోర్టల్ తెచ్చాక 98 శాతం సమస్యలు పోయాయని అన్నారు. ధరణి వల్లే సమస్యలు, గొడవలు తగ్గాయన్నారు. త్వరలో జరిగే రెవెన్యూ సదస్సులో ఆ కొద్దిపాటి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షపై విరుచుకుపడ్డారు మంత్రి గంగుల. మౌన దీక్ష ప్రధాని మోదీ ఇంటి వద్ద చేద్దాం పదా అని అన్నారు. అందరికీ రూ. 15 లక్షలన్న ప్రధాని మోదీ కోసం ప్రతీ ఏటీఎం వద్ద కుర్చీలు వేసుకుని నిరసన చేద్దామని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వనందుకు యూపీఎస్సీ వద్ద కుర్చీ వేద్దామన్నారు. గ్యాస్ ధర పెంచినందుకు ప్రతి ఇంటిముందు కుర్చీ వేసి దీక్ష చేద్దామని బండికి సవాల్ విసిరారు.