Telangana: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి..
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. డిసెంబర్ నుండి రేషన్ షాపులలో సన్నబియ్యంతో పాటు ప్లాస్టిక్ రహిత మల్టీపర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనుంది. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంచులపై ప్రభుత్వ ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు ఉంటాయి.

హైదరాబాద్‌లోని రేషన్‌కార్డు లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యంతో పాటుగా మల్టీపర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ నిర్ణయం ద్వారా పౌరసరఫరాల శాఖ ఇకపై పర్యావరణహితంగా ఉండే మందమైన క్లాత్ సంచుల్లోనే సన్న బియ్యం సరఫరా చేయనుంది. ఈ బ్యాగుల మీద ప్రభుత్వ ఆరు గ్యారంటీల లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను కూడా ముద్రించారు. వాస్తవానికి ఈ సంచుల పంపిణీ అక్టోబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా.. జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఒక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఒక వ్యక్తి రోజుకు సగటున 10 నుంచి 12 ప్లాస్టిక్ కవర్లను తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. వినియోగించిన తర్వాత వీటిని చెత్తకుప్పల్లో పడేయడం పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్, పేపర్ వంటి వాటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ మల్టీపర్పస్ బ్యాగులను రేషన్ సరుకులతో పాటు కూరగాయలు, ఇతర సామగ్రి తెచ్చుకునేందుకు కూడా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ నగరంలో రేషన్ కార్డుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం నగరంలో మొత్తం కార్డుల సంఖ్య 8,28,150 కు చేరుకుంది. కొత్త కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ కావడంతో, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లబ్ధిదారులందరికీ డిసెంబర్ నుంచి ఉచిత మల్టీపర్పస్ సంచులు అందనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
