AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీకి తలనొప్పిగా మారిన రాజాసింగ్‌..! మరోసారి పార్టీ నుంచి సస్పెండ్‌ అవుతారా?

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీకి తలనొప్పిగా మారారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, బీఆర్ఎస్‌తో బీజేపీ నేతల రహస్య సమావేశాలపై ఆరోపణలు చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, సస్పెన్షన్‌కు సైతం సిద్ధమని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతోందని బీజేపీ భావిస్తోంది.

బీజేపీకి తలనొప్పిగా మారిన రాజాసింగ్‌..! మరోసారి పార్టీ నుంచి సస్పెండ్‌ అవుతారా?
Raja Singh
SN Pasha
|

Updated on: Jun 03, 2025 | 11:25 AM

Share

క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీలో కొరకరాని కొయ్యగా మారారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందుత్వ అజెండాతో ఆయన సృష్టించే వివాదాలకంటే సొంత పార్టీపై తరచూ చేస్తు్న్న విమర్శలపై తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజాసింగ్ తరచూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతూ వ్యాఖ్యలు చేస్తుండంటతో ఆయనపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో అసంతృప్తి రాగాన్ని వినిపిస్తున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని తరచూ ఆక్రోశించే రాజాసింగ్‌కి పార్టీని విమర్శించడానికి ఏదో ఒక సందర్భం దొరుకుతూనే ఉంటుంది. ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్‌ విలీన ప్రయత్నాలు జరిగాయని కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ బాంబు పేల్చారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో కలిసిపోతారని, ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి.

మరో సందర్భంలోనూ సొంత పార్టీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనపై యుద్ధం మొదలైందని దొంగలంతా ఒక్కటయ్యారని ధ్వజమెత్తారు. కరీంనగర్ నుంచే తనపై వార్ స్టార్ట్ అయిందన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్ధించినందుకే తనపై సోషల్ మీడియాలో వార్ నడుస్తోందని రాజాసింగ్ ఇవాళ తాజాగా మరో ప్రెస్ నోట్ విడుదల చేశారు. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని చెప్పిన ఆయన ఇక భరించలేకపోతున్నానని, పార్టీకి తాను అవసరం లేదు వెళ్లిపో అంటే వెళ్లేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని కూడా అన్నారు. మరోసారి పాత సామాను బయటకు పోతేనే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని, ఇలాంటి సీక్రెట్ మీటింగ్‌లు పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. చాలాసార్లు రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఆయన నోటి దురుసుకు విసిగిపోయిన పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన్ని సస్పెండ్ చేసింది కూడా. ఆయన ఎంత బతిమాలుకున్నా చాలాకాలం సస్పెన్షన్ ఎత్తేయలేదు. చివరకు జాతీయ నాయకత్వం దయతలచి సస్పెన్షన్ ఎత్తేసింది. ఇంత జరిగినా రాజాసింగ్‌లో మార్పు రాలేదు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అధ్యక్ష పదవి నిఖార్సైన పార్టీ నేతలకు మాత్రమే ఇవ్వాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో రహస్యంగా సమావేశాలు అయ్యే వారికి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఇవ్వొద్దన్నారు. బీజేపీలో బీఆర్ఎస్‌ విలీన ప్రయత్నాలపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కూడా రాజాసింగ్ మద్దతు పలకడంతో క్రమశిక్షణ ఉల్లంఘనలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే బీజేపీ రాజసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నోటీసుల ప్రచారంపై సైతం రాజాసింగ్ స్పందించారు. ఒకవేళ అది నిజమైతే నోటీస్ కాదు సస్పెండ్ చేయండని అన్నారు. తాను ఎటువంటి నోటీసులకు భయపడనని అన్నారు. నన్ను సస్పెండ్ చేస్తే ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో నిజాలు బయటపెడతానని..పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని రాజాసింగ్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..