Telangana: ధాన్యం తడవనివ్వకండి… వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి: మంత్రి తుమ్మల
Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాలపై అధికారులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల పట్ల సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పంటను పరిశీలించి వెంటనే నివేదిక అందించాలన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తెలుగురాష్ట్రాలో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వడండ్ల వాన దాటికి పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి నివేదికను అందించాలని అగ్రికల్చర్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం రాసులపై కప్పేందుకు కవర్లు లేక.. పలు ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిచినట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. మార్కెట్‌లోకి వచ్చిన ధాన్యాం తడవకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడూ గోడౌన్‌లలోకి తరలించాలని ఆదేశించారు.
రానున్న రోజుల్లోనూ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వర్షాల పట్లా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితులను పరిశీలిస్తూ…రైతులకు ఎలాంటి నష్టం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి