Telangana Elections: ఇవాళ రామప్ప ఆలయానికి రాహుల్‌గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర షూరూ
Rahul Gandhi to launch Bus Yatra: ముందుగా.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి బస్సు యాత్రను స్టార్ట్ చేయనున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించనున్న రాహుల్, ప్రియాంక.. రైతులు, మహిళలు, నిరుద్యోగులతో సమావేశమవుతారు. అలాగే.. పలుచోట్ల బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రామప్ప ఆలయాన్ని సందర్శించబోతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అయితే ఈ సందర్భంగా ప్రత్యర్ధి పార్టీల నేతల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ నిజంగానే శివభక్తుడా.. లేక ఓట్ల కోసం ఇలాంటివి చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ షూరూ చేస్తోంది. దానిలో భాగంగా ఇవాళ్టి నుంచి బస్సు యాత్రలు చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ యాత్రను ప్రారంభించేందుకు.. కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ రాష్ట్రానికి వస్తున్నారు.
ముందుగా.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి బస్సు యాత్రను స్టార్ట్ చేయనున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహించనున్న రాహుల్, ప్రియాంక.. రైతులు, మహిళలు, నిరుద్యోగులతో సమావేశమవుతారు. అలాగే.. పలుచోట్ల బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
అయితే రాహుల్ శివపూజపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన నిజమైన శివభక్తుడు కాదంటూ గతంలోనూ అనేక సార్లు ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే అవన్నీ కొట్టిపడేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. రాహుల్ గాంధీ నిజంగానే శివుని భక్తుడు అంటూ చెప్పుకొస్తున్నారు. గతంలో ఆయన శివాలయాలకు వెళ్లిన సందర్భాలను ప్రస్తావిస్తున్నారు.
రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని 2022లో రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహుల్ గాంధీ కూడా శివభక్తుడని మీకు తెలుసా అంటూ ఆ సందర్భంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పుకొచ్చారు.
2018 ఎన్నికల సందర్భంలోనూ రాహుల్ గాంధీ శివలింగం మీద నీళ్లు పోస్తున్న ఫోటోలతో భోపాల్ లో భారీ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. రాహుల్ శివభక్తుడు అంటూ ప్రచారం చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ పర్యటించిన సందర్భంలోనూ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. రాహుల్ గాంధీ.. శివభక్తుడు అని సంబోధిస్తూ హోర్డింగ్‌లు పోస్టర్‌లు వేశారు. శివుని చిత్రపటానికి రాహుల్ గాంధీ పూజలు కూడా నిర్వహించారు.
ఇక మానససరోవర్‌లో సైతం రాహుల్ గాంధీ పర్యటించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సంస్కృత శ్లోకాలు, ఉపనిషత్తులను కూడా ఆ ఫోటోలతో పాటు షేర్ చేసారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తిరునల్వేలిలోని అరుల్ముగు నెలైపర్ ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు రాహుల్ గాంధీ. తలపాగా చుట్టి.. నామాలు పెట్టి.. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చారు.