TS High Court: తెలంగాణలో ఫిజికల్ క్లాసుల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్.. అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే..?
పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై ప్రైవేట్ స్కూల్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులకూ ప్రత్యక్ష బోధన ఆందోళనకరమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Telangana Schools Re-open: తెలంగాణలో సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యాసంస్థలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఆన్‌లైన్ క్లాసులు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్‌లైన్ క్లాసులకు రాలేనివారికి ఆన్‌లైన్‌లో కూడా క్లాసులు అందుబాటులో ఉండేలా విద్యా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
అయితే, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై ప్రైవేట్ స్కూల్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులకూ ప్రత్యక్ష బోధన ఆందోళనకరమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యక్ష బోధన సరికాదన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 31న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
కోవిడ్ కారణంగా మూతబడిన విద్యాసంస్థలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెరుచుకోబోతున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా వైరస్ అంతం కాకపోయినప్పటికీ స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తల్లిదండ్రులు అనుమతి ఇవ్వని పక్షంలో ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా కొనసాగించనున్నాయి ప్రైవేట్ విద్యాసంస్థలు.
ప్రభుత్వ బడుల్లో ఆన్‌లైన్ తరగతులు T సాట్, యాదగిరి ద్వారా కొనసాగుతాయని గతంలోనే ప్రకటించారు. అయితే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ సెక్షన్స్‌కు మాత్రం ప్రత్యక్ష తరగతులకు కొంత సమయం తీసుకోవాలని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ భయం వెంటాడుతున్నందున పై తరగతులకు క్లాసులు జరిగిన కొన్ని రోజులకు పరిస్థితి బాగుంటే, కింది తరగతి పిల్లలకు క్లాసులు నిర్వహిస్తారు. ఇంకా జనాల్లో కోవిడ్ భయం ఉన్నందున ప్రైమరీ క్లాసుల నిర్వహణకు పేరెంట్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోందని అంటున్నారు అధికారులు.
మరోవైపు స్కూళ్లలో ఐదుగురికి పాజిటివ్ వస్తే, పాఠశాల మూసేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని కూడా చెప్పడంతో ప్రైవేట్ పాఠశాలలు పేరెంట్స్‌ను అనుమతి పత్రం అడుగుతున్నారు. ఇక విద్యాసంస్థలు కూడా వైరస్ ముప్పు వాటిల్లకుండా ఎప్పటికప్పుడు శానిటైజేషన్, భౌతిక దూరం ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇదిలావుంటే, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలు పున:ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీవీ9కి తెలిపారు. మరింత ఆలస్యం అయితే పిల్లలు సైకలాజికల్‌గా ఇబ్బందులు పడే అవకాశముందన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి covid 19 నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహిస్థామని మంత్రి చెప్పారు. ఫిజికల్ తరగతులతో పోలిస్తే ఆన్లైన్ తరగతులు అంత ఎఫెక్ట్ గా ఉండవన్నది అందరూ ఏకీభవించాలన్న మంత్రి.. లోకల్ బాడీ మొత్తం ఇన్వాల్వ్ కావాలని అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.