Telangana: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి లేఖపై స్పందించిన రాష్ట్రపతి ముర్ము.. ఆమె ఏమన్నారంటే..
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత రాఘవ రెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి చేసిన వినతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి ప్రైవేట్ సెక్రటరీకి..
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత రాఘవ రెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి చేసిన వినతిపై హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి ప్రైవేట్ సెక్రటరీకి ఆమె ఆదేశాలు జారీ చేశారు. జీ.రాఘవరెడ్డి కుటుంబం తనను వరకట్నం పేరుతో వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఆయన కోడలు ప్రజ్ఞా రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన సమస్యను మెయిల్ ద్వారా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన ప్రజ్ఞారెడ్డి.. గతంలో పుల్లారెడ్డి మనుమడు ఏక్ నాథ్ రెడ్డి(భర్త) తనను వేధిస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి పోలీసులను ఆశ్రయించారు.
తనను ఒక గదిలో బంధించి.. బయటికెళ్లే వీల్లేకుండా గోడను నిర్మించారని ప్రజ్ఞా పోలీసులకు తెలుపగా.. పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. తాజాగా ప్రజ్ఞారెడ్డి చేసిన మెయిల్ ద్వారా మరోసారి వీరి వివాదం తెరపైకొచ్చింది. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ఆ ఇంటికోడలైన ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. ఆ లేఖలో.. రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డి గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి పేర్కొన్నారు.
తనను, తన కుమార్తెను చంపేందుకు కూడా ప్రయత్నించినట్లు ప్రజ్ఞారెడ్డి లేఖలో రాష్ట్రపతికి వివరించారు. తమకు న్యాయం చేయాలని ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముర్ము చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి ప్రైవేట్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..