RIMS Adilabad: రిమ్స్ కు రాజకీయ మకిలీ… పొలిటికల్ సర్కస్‌గా మారిన పెద్దాసుపత్రి

RIMS Adilabad: రిమ్స్ కు రాజకీయ మకిలీ... పొలిటికల్ సర్కస్‌గా మారిన పెద్దాసుపత్రి
Adilabad RIMS

RIMS Adilabad: అదేంటి పేదోడికి పెద్ద దిక్కుగా మారి ప్రాణాలు కాపాడాల్సిన పెద్దాస్పత్రి పొలిటికల్ సర్కస్‌లో చిక్కుకోవడం ఏంటనుకుంటున్నారా..? అక్కడ నిత్యం చోటు చేసుకునే వివాదాల రచ్చ చూస్తే మీరు కూడా అదే మాటంటారు‌.

Janardhan Veluru

|

Jul 06, 2021 | 10:58 AM

RIMS Adilabad: నిత్యం‌ వివాదాలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు , ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, గొడవలు.. అచ్చం పొలిటికల్ సర్కిల్ లో కనిపించే యాక్షన్ కి ఏమాత్రం తీసిపోని రియాక్షన్ సెంటర్ ఆదిలాబాద్ రిమ్స్ – రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్(RIMS Adilabad).. అదేంటి పేదోడికి పెద్ద దిక్కుగా మారి ప్రాణాలు కాపాడాల్సిన పెద్దాస్పత్రి పొలిటికల్ సర్కస్‌లో చిక్కుకోవడం ఏంటనుకుంటున్నారా..? అక్కడ నిత్యం చోటు చేసుకునే వివాదాల రచ్చ చూస్తే మీరు కూడా అదే మాటంటారు‌. మాయదారి కరోనా కాలంలోనూ ఎందరో రోగుల ప్రాణాలు కాపాడుతూ శభాష్ అనిపించుకున్న నోటితోనే ఇదేం మాయదారి ఆస్పత్రి‌ రాజకీయంరా బాబోయ్ అని పిలిపించుకుంటుంది కూడా. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. తమకు అనుకూలంగా లేని వైద్యులను సాగనంపడమే ఏకైక లక్ష్యంగా కొనసాగుతుందా అన్న తీరున కనిపిస్తోంది రిమ్స్ ఆస్పత్రి‌ .

పేదోడికి వైద్యసేవల్లో ముందుక్కీ వెనక్కీ మొన్నటి వరకు డైరక్టర్ వర్సెస్ డాక్టర్స్ గా సాగిన గొడవ కాస్త తాజాగా డైరక్టర్ వర్సెస్ పొలిటికల్ లీడర్స్ గా టర్న్ తీసుకుంది. అంటే ఇక అప్పటి నుండి డైరక్టర్ డాక్టర్ బలరాం నాయక్ కు ఎప్పుడు టాటా బైబై చెప్పేద్దామా అన్న రేంజ్ లోనే జిల్లా రాజకీయ నాయకుల ఆలోచనలు కొనసాగాయట. సీన్ కట్ చేస్తే ఆరోజు రానే వచ్చింది.. బలరాం నాయక్ ను రిమ్స్ డైరక్టర్ పోస్ట్ నుండి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫొరెన్సిక్ ప్రొఫెసర్ గా రిమ్స్ లో విదులు నిర్వహిస్తున్న కరుణాకర్ అనే సీనియర్ డాక్టర్ కు రిమ్స్ ఇంఛార్జ్ డైరెక్టర్ గా నియమిస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ ఉన్న పళంగా రిమ్స్ డైరక్టర్ కు ఉద్వాసన పలకడం వెనుకున్న కారణాలేంటో తెలుసుకోవాలంటే బలరాం నాయక్ డైరక్టర్ గా కొనసాగిన టైంలో తెరపైకొచ్చిన వివాదాల గురించి తెలుసుకుంటే చాలు.

నిత్య వివాదాలు.. అడుగడుగున అడ్డంకులు.. రిమ్స్ డైరక్టర్ గా బలరాం నాయక్ బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో వైద్యుల కొరత తీవ్రంగా వేదించింది. ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుండి గట్టెక్కెలా నియమకాలు సాగుతున్నాయి. అయితే కరోనా ఎంట్రీతో ఆ సమస్య మరింత జఠిలంగా మారింది. కరోనా మొదటి వేవ్ లో కోవిడ్ వార్ట్ లో వసతుల లేమితో వైద్యం కోసం వచ్చిన పది మంది కరోనా రోగులు పారిపోవడంతో ఆదిలాబాద్ రిమ్స్ వార్తల్లోకి‌ ఎక్కింది‌. ఆ రోజు నుండి మొదలు ఈ రోజు వరకు నిత్య వివాదాలతో రిమ్స్ వార్తల్లో నానుతూనే ఉంది. రిమ్స్ రెండవ ఫ్లోర్ వరుస ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు చికిత్స అందించే రిమ్స్‌లోని ఆర్‌ఐసీయూ(రెస్పిరేటరీ ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌) వార్డులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం రోగుల్లో మరింత భయాన్ని పెంచింది. ఆ వెంటనే రెమిడిసివర్ ఇంజక్షన్ల గోల్ మాల్ యవ్వారంతో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా జనరల్ వార్డ్ లో కాలం చెల్లిన ఇంజక్షన్లను రోగులకు ఇస్తూ వైద్య సిబ్బంది రెడ్ హ్యండడ్ గా పట్టుబడటంతో ఆ ఆందోళన తారస్థాయికి చేరింది. ఇలా వరుస వివాదాలతో రిమ్స్ ప్రతిష్ట మసకబారుతూ వస్తుంది. వీటన్నింటికి కారణం రిమ్స్ డైరక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించడం.. సీనియర్ డాక్టర్లకు రిమ్స్ లో పెత్తనం ఇవ్వకపోవడమే కారణం అన్న వాదన కూడా ఉంది. దీంతో ఈ డైరక్టర్ ఉంటే తమ ఆటలు సాగవనుకున్న కొందరు సీనియర్ వైద్యులు నిత్యం ఏదో ఒక వివాదంతో రిమ్స్ ఆస్పత్రికి మచ్చ తెచ్చే ప్రయత్నాలు చేశారని‌ ఆరోపణలు సైతం గుప్పుమన్నాయు. ఇందుకు సదరు సీనియర్ వైద్యులకు స్థానిక ప్రజాప్రతినిదులు ( ఎమ్మెల్యేలు ) అండదండగా నిలిచారన్నది టాక్ కూడా ఉంది. తాజాగా డైరక్టర్ మార్పు తో ఇదంతా నిజమని‌ తేటతెల్లమైందంటున్నారు మరికొందరు రిమ్స్ వైద్యులు.

ఓ వైపు కొలువుల భర్తీ.. మరోవైపు డైరక్టర్ భర్తరప్ ఇన్నాళ్లు స్థానిక‌ప్రజాప్రతినిధులకు డైరక్టర్ కు మధ్య నివురగప్పిన నిప్పులా కొనసాగిన కోల్డ్ వార్ కాస్త తాజాగా జరిగిన కరోనా రివ్యూ మీటింగ్ లో బరెస్ట్ అయింది. రెమిడిసెవర్ ఇంజక్షన్ల గోల్ మాల్ వ్యవహారం పై స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్ డైరక్టర్ బలరాంను గట్టిగా నిలదీయడంతో.. అసలు రెమిడిసెవర్ లు మాయం కాలేదని, కొందరు సీనియర్ వైద్యులతో స్థానిక ప్రజాప్రతినిదులు‌ కుట్రలు పన్నారని.. తన ఆవేదనను ఆక్రోశాన్ని ఎమ్మెల్యే పై గట్టిగానే వెల్లగక్కారు డైరక్టర్ బలరాం. తనను డైరక్టర్ పదవి నుండి తొలగించేందుకే కొందరు ప్రజాప్రతినిధులు సీనియర్ డాక్టర్లతో కలిసి కుట్రలు పన్నుతున్నారని.. డైరక్టర్ గా తప్పుకోమంటే తానే నిరభ్యంతరంగా తప్పుకుంటానని.. తొలగించేంత వరకు కొనసాగనని‌ చెప్పుకొచ్చారు డైరక్టర్ బలరాం నాయక్. సీన్ కట్ చేస్తే సీనియర్ డాక్టర్ కరుణాకర్ కు ఇంఛార్జ్ డైరక్టర్ గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయంతో బలరాం‌నాయక్ తాజా మాజీగా మారిపోక తప్పలేదు. అయితే ఓ వైపు 220 మంది స్టాప్ నర్స్ ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు డైరక్టర్ భర్తరప్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఐటిడిఏ పరిధిలో ఓ వ్యక్తి రిమ్స్ లో ఉద్యోగాలు కల్పిస్తాం రెండు లక్షలు చెల్లించండి అంటూ ఆశ చూపుతూ యువతులను బురిడి కొట్టించిన విషయం సైతం కలకలం రేపింది. ఆ బురిడి కొట్టించిన వ్యక్తికి లోకల్‌ లీడర్స్ సంబందాలున్నట్టు ఆరోపణలు సైతం వ్యక్తం అయ్యాయి. కేసులు సైతం నమోదయ్యాయి. ఇలా వరుస వివాదాలతో రిమ్స్ సీన్ ఒక్క సారిగా మారిపోయింది.

రోగులతో కిటకిటా.. వసతులు లేక కటకటా ఆదిలాబాద్ జిల్లా‌ ఏజేన్సీ గ్రామాలకే కాదు పక్కనున్న మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని సరిహద్దు‌ గ్రామాలకు సైతం రిమ్స్‌ ఆసుపత్రి పెద్ద దిక్కు. నిత్యం 1500 నుంచి రెండు వేల వరకు రోగులు వస్తుంటారు. ఇలా 24 గంటల పాటు రద్దీగా కనిపించే ఆసుపత్రిలో తరుచు వివాదాలతో నలిగిపోతూనే ఉంది. గత కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ రిమ్స్‌ ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేసి ఇద్దరు వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని కొరడా ఝలిపించారు. ఎవరూ ఊహించని రీతిలో జిల్లా కలెక్టర్‌ వైద్యులపై ఈ రకమైన చర్యలు తీసుకోవడంతో అప్పట్లో జిల్లా వైద్యాధికారుల్లో కలకలం రేపింది. ఆ తరువాత రిమ్స్‌ డైరెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన డా.బలరాంనాయక్‌ తనదైన ముద్ర వేసుకునేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆయన తీరు నచ్చని కొందరు వైద్యులు డైరెక్టర్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతూనే ఉన్నారు. రిమ్స్‌లో అంతకు ముందు వరకు లేని బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేశారు. ఇటీవల కరోనా పరిస్థితులతో దాన్ని కొన్నాళ్ల పాటు పక్కన పెట్టారు. తాజాగా బయోమెట్రిక్‌ ప్రారంభించడాన్ని కొందరు వైద్యులు వ్యతిరేకించడంతో అసలు వివాదం మొదలైనట్లు తెలుస్తుంది.

కరోనా సమయంలో ఆందోళనలు

అసలే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు ఆందోళన బాట పట్టడం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసింది. రిమ్స్‌లో పని చేసే వైద్య సిబ్బందికి తరుచు హెచ్చరికలు చేస్తూ మెమోలు జారీ చేయడంతో బలరాం‌నాయక్ ను డైరక్టర్ పదవి‌నుండి తప్పించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఇంతలోనే రెమిడిసెవర్ ల గొడవ విచారణ కమిటీ ఏర్పాటు దోషులుగా ఇద్దరు డాక్టర్లు తేలడం.. ఆ సమస్యకు ఎండ్ కార్డ్ పటక ముందే రోగులకు‌ కాలం చెల్లిన మందులు ఇచ్చేందుకు స్టాప్ నర్స్ ప్రయత్నించడం ఇవన్నీ డైరక్టర్ పై అక్కసుతో చేసిన కుట్రలే అని తేలాయి. అయితే చర్యలు తీసుకోవాల్సింది తప్పు చేసిన‌ సిబ్బందిపై అయితే సీన్ రివర్స్ అయి.. డైరక్టర్ గా బలరాం నాయక్ కొనసాగితే ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవక తప్పదని బావించిన వైద్యవిద్యాశాఖ డైరక్టర్ గా బలరాం నాయక్ కు వీడ్కోలు పలికినట్టు సమాచారం.

(నరేష్, టీవీ9 తెలుగు రిపోర్టర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా)

Also Read..

మండపేటలో ఫ్లెక్సీల వివాదం.. వైసీపీ కార్యకర్తకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వార్నింగ్.. ఆడియో టేప్ కలకలం

కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా 20 మందికి చోటు.. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు అవకాశం!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu