AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా 20 మందికి చోటు.. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు అవకాశం!

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది... మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

Central Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా 20 మందికి చోటు.. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు అవకాశం!
Pm Modi Central Cabinet Expand
Balaraju Goud
|

Updated on: Jul 06, 2021 | 7:47 AM

Share

PM Modi Central Cabinet Expand: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది… మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోందీ మంత్రివర్గ విస్తరణపై తుది కసరత్తు పూర్తి అయ్యినట్లు తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేస్తూ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

గత కొద్ది రోజులుగా ఢిల్లీలో బీజేపీ కీ లీడర్స్‌ వరుస భేటీలతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. దీనిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కసరత్తు పూర్తి చేసినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, సహాయ మంత్రుల పనితీరుపై రిపోర్ట్స్‌ తెప్పించుకున్నారు. జూన్ 11న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మీట్‌ అయ్యారు. ఆ తర్వాత మంత్రులను గ్రూపులుగా చేసి రివ్యూ జరిపారు. ఈ సమీక్షలో పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నట్లు సమాచారం.

మిత్రపక్షాలు దూరమవడం, మంత్రుల మరణాలతో కేంద్ర కేబినెట్లో ఖాళీలు ఏర్పడ్డాయి. సీనియర్ మంత్రి, మిత్రపక్షం లోక్‌జనశక్తి నేత రాంవిలాస్ పాశ్వాన్, కర్నాటక బీజేపీ నేత సురేశ్ అంగడి మృతితో రెండు శాఖలు ఖాళీ అయ్యాయి. శివసేన, అకాలీదళ్ దూరమైన కారణంగా వారి ప్లేస్‌లు కూడా భర్తీ చేయాలి. ఐదు అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ ఖాళీలు భర్తీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలు జరగనున్నాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో యూపీకి అగ్రపీఠం వేసి ప్రాధాన్యతనిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మిత్రపక్షం అప్నాదళ్‌కు కూడా చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. ఆ పార్టీ నేత అనుప్రియ పటేల్ ఈ మధ్యే అమిత్ షాను కలిసి వెళ్లారు.

ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని భావిస్తున్నట్టు ఢిల్లీలో బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు బీజేపీ వర్గాల్లో టాక్. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్‌ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్‌ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం ముగ్గురిని, గరిష్టంగా ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్ర పక్షమైన అప్నాదళ్‌ నుంచి ఆ పార్టీ చీఫ్‌ అనుప్రియా పటేల్‌కు, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా, ఎంపీ రాకేష్‌ సింగ్‌లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందంటున్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్‌ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్‌ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ ఉన్నారు. వీరిలో జీవీఎల్ కు మంత్రి పదవి దక్కకపోతే.. టీడీపీ నుంచి బీజేపీలోకి అడుపెట్టిన ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. లేదా ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మొండి చేయి చూపిస్తారా అన్నది నేడో, రేపో తేలిపోనుంది.

ఇదిలావుంటే, 2019లో నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 53 మందికి మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. నిబంధనల ప్రకారం 81మంది వరకు ఉండవచ్చు. అందుచేత తన బలాన్ని మరింత పెంచుకునేందుకు మంత్రివర్గ విస్తరణకు ప్రధాని పూనుకున్నట్లు తెలుస్తోంది.

Read Also…  Covid-19 Fake Report: భార్య నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్.. కరోనా ఫేక్‌ రిపోర్ట్‌‌తో వేశాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?