Telangana: ఇలా తయారు అయ్యారేంట్రా బాబూ..! సినిమా సీన్ తలపించే ఛేజింగ్.. చివరికి ఇలా !

దొంగతనం వృత్తి అయినప్పుడు.. ఏ వాహనం అయితే, ఏంటీ అని అనుకున్నాడేమో.. ఓ ప్రబుద్దుడు ఏకంగా ఓ 108 అంబులెన్స్‌నే చోరీ చేశాడు. కానీ, పోలీసులు అలా అనుకోరుగా సినీ ఫక్కీలో ఛేజ్‌ చేసి మరి అతడిని పట్టేశారు.

Telangana: ఇలా తయారు అయ్యారేంట్రా బాబూ..! సినిమా సీన్ తలపించే ఛేజింగ్.. చివరికి ఇలా !
108 Ambulance
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Dec 07, 2024 | 11:01 AM

ఓ వ్యక్తి ఆసుపత్రి వద్ద కాలికి గాయంతో ఉన్నాడు. అయితే ఆ ఆ వ్యక్తి తన ఊరికి వెళ్లాలనుకున్నాడు. అక్కడే ఉన్న ఓ అంబులెన్స్ వేసుకుని వెళ్లాడు. కానీ అనుకున్నట్టుగా అతను ఇంటికి చేరుకోలేదు. అంబులెన్స్‌తో పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు సినిమా స్టైల్ చేజ్ చేయాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే అంబులెన్స్‌తో కల్వర్టుకు ఢీ కొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. అసలేం జరిగింది అంటే..?

హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని ఎత్తుకెళ్లాడో దొంగ. అంబులెన్స్‌తో విజయవాడ పరారయ్యేందుకు యత్నించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కాకపోతే మనోడు చిట్యాల దగ్గర బారికేడ్లను ఢీకొట్టడంతో అసలు హంగామా మొదలైంది. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు వాహనాలను అడ్డుగా పెట్టారు. అయినా ఆగకుండా టోల్‌ప్లాజా దగ్గర వాహనాలను ఢీకొట్టి మరి పరారైయ్యాడు దొంగ. అటు పోలీసులు కూడా తగ్గేదేలే అన్నట్లు టేకుమట్ల మూసీ బ్రిడ్జి దగ్గర మళ్లీ వాహనాలు అడ్డుపెట్టి.. మొత్తానికి మనోడిని పట్టేశారు. మొత్తంగా సినీ ఫక్కీలో దొంగను పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పోలీసులకు గతంలోనూ మనోడు అంబులెన్స్‌లను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స చేయించుకున్నాడు. అయితే అతను ఖమ్మంకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా అంబులెన్స్‌నే ఎత్తుకెళ్లాడు. ఈ క్రమంలోనే పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకువచ్చిన ప్రభుత్వ 108 అంబులెన్స్ సిబ్బంది హాస్పిటల్ పక్కనే పార్క్ చేశారు. ఇది గమనించిన అతను108 ప్రభుత్వ అంబులెన్స్‌ను చోరీ చేసి.. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి వైపు వెళ్లాడు.

అయితే వెంటనే అప్రముత్తమైన అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చోరీకి గురైన అంబులెన్స్ ను పట్టుకునేందుకు సినీ పక్కీలో ఛేజ్ చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా, చిట్యాల, కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్, ఇతర వాహనాలు ఢీ కొట్టి అంబులెన్స్ తో పారిపోయాడు. ఈ క్రమంలోనే చిట్యాల వద్ద అడ్డుకునేందకు ప్రయత్నించగా, వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఒక ఏఎస్ఐ కి తీవ్ర గాయాలయ్యాయి. చివరికి కేతేపల్లి మూసీ బ్రిడ్జిపై లారీలను అడ్డుగా పెట్టి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మూసీ బ్రిడ్జి వద్ద ఉన్న కల్వర్టును ఢీ కొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పాడు. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేక అంబులెన్స్ చోరీ చేశారని పోలీసులు భావిస్తున్నారు. చికిత్స కోసం అంబులెన్స్ దొంగను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..