KTR: అదొక మనసు-మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. సిట్ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతుండటంతో జూబ్లీహిల్స్ పీఎస్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే విచారణకు వెళ్లే ముందే ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కేటీఆర్.. ఈ కేసును ఒక డైలీ సీరియల్‌తో పోల్చారు. ప్రభుత్వం తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. రాజకీయ నేతలంతా దొంగలు అనుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత రెండేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. పనిగట్టుకుని హీరోయిన్లతో లింకులు పెట్టారని, డ్రగ్స్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేటీఆర్ ఒక డైలీ సీరియల్‌తో పోల్చారు. ఈ విచారణ మనసు మమత సీరియల్ లాగా సాగుతోంది అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తాము ఎన్నడూ ప్రతిపక్షాలను వేధించలేదని, అక్రమ పనులకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డిని, ఆయనకు సహకరిస్తున్న పోలీసు అధికారులను అస్సలు వదిలిపెట్టనని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని తాము బయటపెడుతున్నందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విచారణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో హరీష్ రావును విచారించినప్పుడు ఆయన సంధించిన ప్రశ్నలకు సిట్ వద్ద సమాధానాలు లేవని, ఇప్పుడు తనను కూడా అలాగే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
