Telangana Government: తెలంగాణలోని మహిళలకు అద్భుత అవకాశం.. ప్రభుత్వం మరో కీలక అప్డేట్.. లక్షల్లో ఆదాయం పొందే ఛాన్స్
తెలంగాణలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంబించనుంది. అదేంటంటే.. మహిళలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించనుంది. ఈ బస్సులను నడపడం ద్వారా మహిళా సంఘాలు ఆదాయం పొందవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోండగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అమలుకు సిద్దమయ్యారు.

తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. వారిని ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది. స్త్రీ శక్తి పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారు తయారుచేసే ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బజార్లు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఇక డ్వాక్రా సంఘాలకు పెట్రోల్ బంక్‌లు, విజయ డెయిరీ పార్లర్లు లాంటివి మంజూరు చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వం మహిళా స్వయం సహకార సంఘాలకు మరో అవకాశం కల్పించనుంది. వారికి హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనుంది. వీటి ద్వారా మహిళలు ఆదాయం సంపాదించుకునే అవకాశం లభించనుంది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్‌లోని మహిళా సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త అందించారు. నగరంలోని మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. నగరంలో మొత్తం 72,947 గ్రూపులు ఉండగా.. తొలుత 40 నుంచి 50 మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మహిళా సంఘాలకు సంపాదన వస్తుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అధికారులతో పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే నగరంలోని మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుకొచ్చే మహిళలను గుర్తించే ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. అర్హులను గుర్తించి వీటిని కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు
అలాగే రాష్ట్రంలోని మహిళా సంఘాలు అన్నింటికీ వడ్డీ లేని రుణం ప్రభుత్వం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించాలనే లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లల్లో మహిళా సంఘాలకు భారీగా రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇటీవల కొమరం భీమం జిల్లాలో మహిళా సంఘాలకు రాయితీ రుణాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. మహిళలు వడ్డీ లేని రుణాలు పొందటంలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆలస్యం చేయకుండా వెంటనే రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీకి కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
