AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లింగా.. ఓలింగా.. జనసంద్రమైన పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి మధ్య రాకపోకల సాగిస్తున్నారా..? అయితే మీకొక అలర్ట్ న్యూస్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. లింగమంతుల స్వామి జాతర ఐదు రోజులపాటు జరిగనుంది.. ఈ జాతర కు లక్షలాదిమంది భక్తులు తరలిరానున్నారు.

లింగా.. ఓలింగా.. జనసంద్రమైన పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు..
Peddagattu Jathara
M Revan Reddy
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 17, 2025 | 7:13 AM

Share

తెలంగాణలో గొల్ల(పెద్ద) గట్టు జాతరగా ప్రసిద్ధికెక్కిన లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతరగా దీనికి పేరుంది. యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్థ రాత్రి కేసరం నుంచి పెద్దగట్టు దేవరపెట్టే రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజులపాటు జరగనున్న జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తులు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటర్లు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.. దీంతో జాతర జనసంద్రమైంది.. కాగా.. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు.

హైవేపై ట్రాఫిక్ మళ్లింపు..

సూర్యాపేట జిల్లా దుగ్గరాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు లక్షలాదిమంది భక్తులు తరలిరానున్నారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జాతీయ రహదారిపై ఆంక్షలు విధించారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా విజయవాడకు మళ్లిస్తున్నారు. అలాగే, విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తున్నారు..

ఐదు రోజులపాటు జాతర… రోజుకో ప్రత్యేకత..

సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్‌పల్లి పెద్ద గుట్టపై జరిగే లింగమంతుల స్వామి జాతర. దీనిని పెద్దగట్టు, గొల్లగట్టు జాతరగా కూడా పిలుస్తుంటారు. ఈ జాతరకు 300 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. మేడారం జాతర మాదిరిగానే ఈ జాతర ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు. ఈ జాతర ఆసియాలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచింది. లింగమంతుల స్వామిని యాదవుల ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు.

తొలి రోజు గంపల ప్రదర్శన:

ఆదివారం అర్ధరాత్రి నుండి ప్రారంభమైన లింగమంతల స్వామి తొలి రోజున భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని గుడి చుట్టూ గంపల ప్రదక్షిణతో చేస్తారు.

రెండో రోజు కంకణ అలంకరణలు.. స్వామివారి కొలుపులు:

రెండోరోజు యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేసి బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పిస్తారు. చౌడమ్మ తల్లికి వర్ధ గొర్రె, తల్లి గొర్రె, బద్దేపాల గొర్రె, బోనాలు సమర్పిస్తారు.

మూడవరోజు కీలక ఘట్టం.. చంద్ర పట్నం:

ఇక మూడో రోజైన స్వామి వారి కళ్యాణంలో చంద్రపట్నం వేస్తారు. చంద్రపట్నం వేసి లింగమంతుల స్వామి, చౌడమ్మ బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. ఆకర్షణీయంగా చంద్రపట్నం వేసి దేవరపెట్టెను ప్రతిష్టింపజేశారు.

నాలుగవ రోజు నెలవారం.. దేవర పెట్టే తరలింపు:

కేసారం నుంచి పాలు తీసుకొచ్చి రెండు కొత్త బోనం కుండల్లో పొంగిస్తారు. అనంతరం మాంసాన్ని వండుకొని తినడం ఆనవాయితీ. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు.

ఐదో రోజు… మకర తోరణం తొలగింపు..

ఐదో రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. దీంతో ఐదురోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర ముగుస్తుంది. శంభు లింగా అంటూ ఐదు రోజుల పాటు స్వామివారిని పూజించిన లింగమంతుల తిరిగి తమ తమ స్వగ్రామాలకు పయనమవుతారు. ఐదు రోజులపాటు ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో పెద్దగట్టు మార్మోగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..