AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake IT Jobs: నకిలీ ఇంటర్వ్యూలు.. ఉత్తుత్తి ఉద్యోగాలు.. పేరిట ఘరానా మోసం! రూ.8.5 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి అమీర్‌పేట్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే అక్కడ అతడికి ఓ వ్యక్తి పరిచయమై తనకు తెలిసిన ఐటీ కంపెనీలో బ్యాక్‌డోర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు. అయితే తనకు కాల్‌లెటర్‌ వచ్చాక 3 నెలల జీతం ఇవ్వాలని షరతు పెట్టాడు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అతడు అడిగినంత సమర్పించుకున్నాడు. కానీ..

Fake IT Jobs: నకిలీ ఇంటర్వ్యూలు.. ఉత్తుత్తి ఉద్యోగాలు.. పేరిట ఘరానా మోసం! రూ.8.5 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
Fake Job Frauds
Srilakshmi C
|

Updated on: Feb 17, 2025 | 8:08 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17: నిరుద్యోగుల కష్టాలను కొందరు తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు. ఓ కేటుగాడు ఉద్యోగం ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టాడు. మాయ మాటలు చెప్పి, ప్రలోభపెట్టి ఏకంగా కోట్లాది రూపాయలు వారి నుంచి దోచుకున్నాడు. తీరా నష్టపోయామని తెలిసిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణలో ఇటువంటి మోసాలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.

తాజాగా కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి అమీర్‌పేట్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే అక్కడ అతడికి ఓ వ్యక్తి పరిచయమై తనకు తెలిసిన ఐటీ కంపెనీలో బ్యాక్‌డోర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు. అయితే తనకు కాల్‌లెటర్‌ వచ్చాక 3 నెలల జీతం ఇవ్వాలని షరతు పెట్టాడు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అతడు అన్నింటికీ అంగీకరించాడు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఆఫర్‌ లెటర్‌ తీసుకొని మాదాపూర్‌లోని ఐటీ కంపెనీకెళ్తే అది నకిలీదని తేలిసి కుప్పకూలిపోయాడు. ఏడాదికి రూ.12 లక్షల ప్యాకేజీతో జాబ్‌ వస్తుందన్న సంబరంతో రూ.3 లక్షలు ఇచ్చి మోసపోయానంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇలా గ్రేటర్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో గతేడాది ఉద్యోగాల పేరిట దాదాపు 980 మంది మోసపోయారట. వారి నుంచి ఏకంగా రూ.8.5 కోట్లు కేటుగాళ్లు కాజేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై పట్టుమని నెల గడవకముందే 60 మందికి పైగా మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.

కోచింగ్‌ సెంటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల ప్రకటనలు వెలువడగానే ఈ దొంగ ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. ఉద్యోగ వేటలో ఉన్న యువతను గుర్తించేందుకు ఏజెంట్లను నియమించి వారి ద్వారా రైల్వే, ఎయిర్‌పోర్టు, సైబర్‌క్రైమ్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నట్టేటముంచుతున్నారు. తొలుత దళారులే కంపెనీ HR మేనేజర్లుగా నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించి, పలు కంపెనీల పేరిట నకిలీ మెయిల్‌ ఐడీ తయారు చేసి కాల్‌లెటర్‌ పంపుతున్నారు. విదేశాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.20 నుంచి 35 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఉద్యోగాల పేరిట మోసం చేసిన ముఠాను అరెస్ట్‌ చేశారు.వీరి మాటలు నమ్మి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 మంది మోసపోయినట్టు దర్యాప్తులో తేలింది. పార్ట్‌టైమ్‌ జాబ్‌ లింక్‌లను క్లిక్‌ చేయొద్దని సైబర్‌క్రైమ్‌ డీసీపీ కవిత దార నిరుద్యోగులకు సూచించారు. ఎవరైనా ఇలా మోసపోతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.