ఉస్మానియాలో ప్రపంచంలోనే అరుదైన ఆపరేషన్.. 18 గంటల పాటు కష్టపడ్డ 30మంది డాక్టర్లు… రికార్డ్

ఆరు నెలలకే చిన్నారిలో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. చర్మం మొత్తం పొడిబారి, పొలుసులు రాలటం ప్రారంభమైంది. జుట్టు ఊడిపోతుండేడి. పసివాడిలో ఎదుగుదల లేదు. దాంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్‌లోని..

ఉస్మానియాలో ప్రపంచంలోనే అరుదైన ఆపరేషన్.. 18 గంటల పాటు కష్టపడ్డ 30మంది డాక్టర్లు... రికార్డ్
Rare Syndrome
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2022 | 3:34 PM

దేశంలోనే పేరున్న హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రి మరో ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా, ప్రపంచంలో నాలుగో అరుదైన ఆపరేషన్‌ జరిగింది హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో..ఇందుకోసం మొదటిసారిగా ఉస్మానియా, నిలోఫర్‌ డాక్టర్లు ఏకమయ్యారు. డాక్టర్లు, పీజీ విద్యార్థులు, నర్సింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 30 మంది సభ్యుల బృందం పద్దెనిమిదిన్నర గంటలపాటు ఆపరేషన్‌ థియేటర్‌లోనే అవిశ్రాంతంగా శ్రమించి ఓ చిన్నారికి ప్రాణం పోశారు. అదే కార్పొరేట్‌ ఆస్పత్రిలో అయితే, దాదాపు రూ. 30లక్షల వరకూ ఖర్చవుతుందని కానీ, ఉస్మానియా ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించి రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ఇంతకీ ఏంటా సర్జరీ, చిన్నారికి వచ్చిన వ్యాధి ఏంటి…? పూర్తి వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన ప్రేమలత, నారాయణ దంపతులకు పదినెలల క్రితం రెండో సంతానంగా శివాన్ష్‌ పుట్టాడు. ప్రేమలత అంగన్‌వాడీ కార్యకర్త కాగా, నారాయణ వ్యవసాయ కూలీ. తొలిచూరు బిడ్డ పురిట్లోనే మరణించిన తర్వాత.. శివాన్ష్‌ పుట్టడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. అయితే అది కొద్దిరోజులు మాత్రమే. ఆరు నెలలకే చిన్నారిలో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. చర్మం మొత్తం పొడిబారి, పొలుసులు రాలటం ప్రారంభమైంది. జుట్టు ఊడిపోతుండేడి. పసివాడిలో ఎదుగుదల లేదు. దాంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదట్లో పసరికలు (జాండిస్‌) అని భావించిన వైద్యులు.. ఆ మేరకు రెండు వారాలపాటు చికిత్స అందించారు. ఫలితం లేకపోగా, శివాన్ష్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. మరోమారు వైద్యపరీక్షలు జరిపిన నిలోఫర్‌ వైద్యులు జన్యువ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించారు. దీంతో పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఉషారాణి శివాన్ష్‌ను ఉస్మానియా దవాఖానకు రెఫర్‌ చేశారు.

తొలుత శివాన్ష్‌ను ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు వైద్యులు. కాలేయ వ్యాధితోపాటు కడుపులో నీరు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మందులతో తగ్గించాలని ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. చిన్నారి తల్లి కాలేయంలో కొంత భాగాన్ని సేకరించి, జూన్‌ 17న కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్టు డా.మధుసూదన్‌ తెలిపారు. శస్త్ర చికిత్స 18 గంటలపాటు జరిగిందని, చిన్నారి కోలుకోవడంతో బుధవారం డిశ్ఛార్జి చేశామని వెల్లడించారు. డాక్టర్లు, పీజీ విద్యార్థులు, నర్సింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 30 మంది సభ్యుల బృందం పాల్గొందన్నారు. వీరిలో పలు విభాగాల వైద్యులు వాసిఫ్‌ అలీ, సుదర్శన్‌, ఆదిత్య, వరుణ్‌, అమర్‌దీప్‌, పాండునాయక్‌, వెంకటేశ్వర్లు, సునీల్‌, హరీశ్‌, ఉషారాణి, రమేశ్‌, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నట్టు చెప్పారు. మేనరికపు వివాహాలు లేదా వంశపారంపర్యంగా సంక్రమించే కాలేయ వ్యాధిని వైద్య పరిభాషలో నియోనాటల్‌ సిరోసిస్‌ స్కాల్ప్‌ అల్ఫోసియా, కొలనాజియో హెపటైటిస్‌గా పేర్కొంటారని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

దాదాపు రెండున్నర నెలల అనంతరం గురువారం చిన్నారి శివాన్ష్‌ను డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా సిబ్బంది ఆనందంతో బాలుడికి వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు ప్రేమలత, నారాయణ భావోద్వేగానికి గురయ్యారు. సర్జరీ చేసిన వైద్యులు, నర్సింగ్‌, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు సహాయం అందించినందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి