Telagnana: ఉమ్మడి రాష్ట్రంలో సహచర మంత్రులు.. తెలంగాణ వచ్చాక ప్రత్యర్థులు.. పొరుగు రాష్ట్రంలో పోరుకు సై..
Karnataka Elections: తెలంగాణ వచ్చాక ప్రత్యర్థులుగామారారు. పొరుగు రాష్ట్రంలో తమ పార్టీల గెలుపు కోసం కత్తులు నూరుతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు..ఇప్పుడేం చేస్తున్నారు.
ఆ ఇద్దరూ ఒకప్పుడు కలిసి మెలిసి పని చేశారు. నవ్వుతూ మాట్లాడుకున్నారు. అసెంబ్లీలో కూడా ఎన్నో సార్లు కలిశారు. ఇదంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. తెలంగాణ వచ్చాక ప్రత్యర్థులుగామారారు. పొరుగు రాష్ట్రంలో తమ పార్టీల గెలుపు కోసం కత్తులు నూరుతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు.. ఇప్పుడేం చేస్తున్నారు. వినడానికే విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం.. ఇద్దరిదీ తెలంగాణే..అయినా.. ఇప్పుడు బద్ధ శత్రువులయ్యారు. పొలిటికల్ పిక్చర్‌లో ఎప్పుడెవరు మిత్రులవుతారో..ఎప్పుడెవరు శత్రువులవుతారో ఎవరూ చెప్పలేరు. అంతా అవసరాన్ని బట్టి..అప్పటి సిచ్యుయేషన్‌ను బట్టి సీన్ మారుతూ ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీధర్ బాబు, డికె అరుణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు. ఆ పార్టీలో వీళ్లు సీనియర్లు కూడా.. అయినా.. తెలంగాణ ఏర్పడ్డాక డికె అరుణ కాంగ్రెస్‌కు బైబై చెప్పి.. బిజెపి కండువా కప్పుకున్నారు. శ్రీధర్‌బాబు మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ సభ్యులుగా ఉన్నారు.
పార్టీల వారీగా ఇద్దరూ నేరుగా తలపడే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే.. శ్రీధర్ బాబు ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే, అరుణ దక్షిణ తెలంగాణ అయిన మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఇద్దరికీ ఎక్కడా నేరుగా పోటీలేనే లేదు. పోటీ రానే రాదు. అయినా.. వీళ్లు ప్రత్యర్థులయ్యారు. ఎలా..
మరో ఆరు నెలల్లో పక్కరాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇవే ఇద్దరి మధ్య కుంపటిగా మారాయి. ఒకప్పుడు కలిసి పనిచేసిన మంత్రులే అయినా..పార్టీ మారాక పెద్దలు చెప్పినట్లు చేయాలి కదా.. లేదంటే..పప్పులు ఉడకవు..
శ్రీధర్ బాబును కర్ణాటక ఎన్నికల పరిశీలన కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. సో.. ఆ పనులు చక్కబెట్టాలంటే ఇప్పటి నుంచే అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి.. ఇక బిజెపి నుంచి ఎన్నికల కో ఇన్‌ఛార్జ్‌గా డికె అరుణను నియమించారు కమలం పెద్దలు.. ఇలా ఇద్దరు తెలంగాణ సీనియర్ నేతలు.. పక్క రాష్ట్రంలో తలపడనున్నారు. పార్టి పరిశీలకులుగా పార్టి పనితీరును అంచనా వేస్తునే… వ్యూహలు రచించనున్నారు.
మరి ఈ రసవత్తర రాజకీయ ఎపిసోడ్‌లో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారోనని ఇరువర్గాల్లో ఎడతెరిపిలేకుండా చర్చలు సాగుతోంది. ఇప్పటి వరకు ఎదురెదురు రాజకీయాలు చేయని వీళ్లిద్దరూ ఇప్పుడు మాత్రం పరస్పర ఆరోపణలకు దిగాల్సిందే..విమర్శలు చేయాల్సిందే.. పార్టీ కోసం ఎంతవరకైనా దూకాల్సిందే.. ఇదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్ అని రెండు పార్టీల్లోని కేడర్‌లో చర్చ జరుగుతోంది.