AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బజ్జీల బండి విషయంలో వాగ్వాదం…చివరికి ఎంతకు దారి తీసిందో తెలుసా?

జోగులాంబగద్వాల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బజ్జీల బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దళిత మహిళపై పక్కింటి వారు దాష్టికానికి దిగారు. బజ్జీల బండిని ఇక్కడి నుంచి తీసేయమని చోటుచేసుకున్న వాగ్వాదం కాస్త సలసల కాగే నూనె ప్రమాదవశాత్తు నిర్వాహకురాలిపై పడి తీవ్ర గాయాలపాలయ్యే వరకు వెళ్లింది.

Telangana: బజ్జీల బండి విషయంలో వాగ్వాదం...చివరికి ఎంతకు దారి తీసిందో తెలుసా?
Oil Spilled On Women
Boorugu Shiva Kumar
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 14, 2024 | 7:24 PM

Share

జోగులాంబగద్వాల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బజ్జీల బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దళిత మహిళపై పక్కింటి వారు దాష్టికానికి దిగారు. బజ్జీల బండిని ఇక్కడి నుంచి తీసేయమని చోటుచేసుకున్న వాగ్వాదం కాస్త సలసల కాగే నూనె ప్రమాదవశాత్తు నిర్వాహకురాలిపై పడి తీవ్ర గాయాలపాలయ్యే వరకు వెళ్లింది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 10వ తేదిన మనపాడు మండలం చిన్నపోతులపాడు గ్రామంలో జరిగిన దళిత మహిళపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన దళిత మహిళ ప్రశాంతమ్మ అలియాస్ ఎస్తేరమ్మ చిన్న బండిపై బజ్జీలు వేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఘటనకు కొన్ని రోజుల ముందు నుంచి పక్కింటివారైన యుగంధర్, అరుణమ్మ, సత్తిలతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ నివాసం పక్కన నుంచి బజ్జీల బండిని తీసేయాలని ఇరువురి మధ్య తగాదా జరుగుతోంది. అయితే ఈ నెల 10వ తేదిన ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానల పెద్దదైంది. యుగంధర్ అనే వ్యక్తి కోపోద్రిక్తుడై బండిని తీసేయాలని నాలుగు చక్రాల బండిని గట్టిగా ఊపీ, ఒక వైపునకు ఎత్తే ప్రయత్నం చేశాడు. అయితే బజ్జీలు వేసేందుకు సిద్ధంగా ఉన్న వేడి వేడి నూనె బండికి అటువైపు ఉన్న ప్రశాంతమ్మ శరీరంపై పడింది. దీంతో ఆమె ఒంటి నిండా కాలిన గాయాలైయ్యాయి. వెంటనే ప్రశాంతమ్మను స్థానికులు కర్నూల్ అస్పత్రికి తరలించారు.

ఇక ఘటనపై ప్రశాంతమ్మ మామ మనపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన పోలీసులు ఘటనపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన యుగంధర్, సత్తి, అరుణలను కస్టడీలోకి తీసుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. అలాగే కర్నూల్‌కు వెళ్లి బాధిత దళిత మహిళ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇక మరోవైపు ఘటనపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నారు. బాధిత మహిళను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి