Telangana: ముళ్ల పొదల్లోంచి వింత శబ్దాలు.. దగ్గరకెళ్లి చూడగా గుండె పగిలే సీన్.. వీడియో చూడండి..
పేగు తెంచుకుని పుట్టిన పసికందును కళ్లారా చూసుకుని మురిసిపోవాల్సిన కన్నవారే కాలయముళ్లయ్యారు. కనికరం లేకుండా చీకట్లో ముళ్లపొదల్లోకి విసిరేసి వెళ్లిపోయారు. రాత్రంతా ముళ్ల నడుమ నరకం అనుభవించిన ఆ నవజాత శిశువు ఏడుపు విన్న స్థానికులు చలించిపోయారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. పేగుబంధాన్ని తెంచుకుని, కనికరం లేకుండా ముళ్లపొదల్లో వదిలేసిన ఓ నవజాత శిశువును స్థానికులు సమయస్ఫూర్తితో కాపాడారు. పట్వారిగూడెం ఎస్సీ కాలనీ పరిసరాల్లో ఈ హృదయవిదారక ఉదంతం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ సమీపంలోని దట్టమైన ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లారు. చీకట్లో పసికందు ఒంటరిగా విలవిల్లాడిపోయింది. ఉదయం వేళ అటుగా వెళ్తున్న ఓ మహిళకు ముళ్లపొదల మధ్య నుంచి సన్నని ఏడుపు వినబడటంతో పాటు కదలికలు కనిపించాయి. అనుమానంతో దగ్గరకు వెళ్లి చూడగా, ముళ్ల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందు కనిపించింది.
ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయిన ఆమె వెంటనే కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి పరుగులు తీశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముళ్ల నుంచి శిశువును అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి ప్రాథమిక రక్షణ కల్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిన్నారిని తక్షణమే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిశువును తమ ఆధీనంలోకి తీసుకుని, అవసరమైన వైద్య సహాయం అందించిన అనంతరం దమ్మపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ అమానుష చర్యకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పసికందు తల్లిదండ్రులు ఎవరు? రాత్రి వేళ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. సమీప ఆసుపత్రుల్లో ఇటీవల నమోదైన ప్రసవాల వివరాలు, రాత్రి వేళ ఆ ప్రాంతంలో సంచరించిన అనుమానితుల కదలికలపై పోలీసులు లోతైన ఆరా తీస్తున్నారు.
