RGV Vyooham: కోర్టులో ఆర్జీవీ వ్యూహం.. సినిమాకు విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా..
వైఎస్ మరణం తర్వాత రాజకీయాల్లో జరిగిన కుట్ర ఏంటి? అధికారం కోసం ఎవరెవరు ఏం చేశారు? నో చేంజ్.. ఉన్నది ఉన్నట్లు చూపించడమే మా వ్యూహం అంటున్నారు డైరెక్టర్ ఆర్జీవి. వైసీపీకి అనుకూలంగానే సినిమా తీశానంటున్నారు. మరోవైపు సినిమా విడుదల అడ్డుకునేందుకు టీడీపీ కూడా ప్రతివ్యూహాల్లో ఉంది? ఇంతకీ సినిమా విడుదల అవుతుందా? లేదా?
వైఎస్ మరణం తర్వాత రాజకీయాల్లో జరిగిన కుట్ర ఏంటి? అధికారం కోసం ఎవరెవరు ఏం చేశారు? నో చేంజ్.. ఉన్నది ఉన్నట్లు చూపించడమే మా వ్యూహం అంటున్నారు డైరెక్టర్ ఆర్జీవి. వైసీపీకి అనుకూలంగానే సినిమా తీశానంటున్నారు. మరోవైపు సినిమా విడుదల అడ్డుకునేందుకు టీడీపీ కూడా ప్రతివ్యూహాల్లో ఉంది? ఇంతకీ సినిమా విడుదల అవుతుందా? లేదా? అన్నదే బిగ్ క్వశ్చన్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహం సినిమా రాజకీయంగా చర్చగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత 2009 నుంచి 2019 వరకూ జరిగిన రాజకీయ కుట్రలే కథాంశంగా సినిమా ఉంటుందని రాంగోపాల్ వర్మ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఎవరి పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఒక స్పష్టత కూడా వచ్చేసింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 10 న రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే సినిమా రిలీజ్‌ను ఆపాలని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా సీఎం జగన్ కోరిక మేరకు చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమా రూపొందించారని లేఖలో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీని కించపరిచేలా ఈ సినిమా నిర్మించారనే విషయం ట్రైలర్ ద్వారా తెలిసిందని.. ఎన్నికల సమయంలో చంద్రబాబును ప్రజల దృష్టిలో దోషిగా చిత్రీకరించటం సినిమాటోగ్రాఫీ చట్టాన్ని ఉల్లంఘించటమేనని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సినిమాకు సర్టిఫికేట్ జారీ చేయవద్దని అథారిటీని అభ్యర్థిస్తున్నానని కోరారు. దీంతో నవంబర్‌లో విడుదల కావల్సిన సినిమా వాయిదా పడింది.
వైఎస్ మరణానంతర రాజకీయలు చిత్రీకరణ..
లోకేష్ ఇచ్చిన లేఖతో తాత్కాలికంగా సినిమా విడుదల నిలిపివేశారు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ అధికారులు. అయితే సీబీఎఫ్సీ అధికారులు సినిమా చూసిన తర్వాత రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ నెల 29న వ్యూహం సినిమా విడుదల చేసేందుకు డైరెక్టర్ ఆర్జీవీ నిర్ణయించారు. సినిమాలో మా వ్యూహం మాకుంటుందని ప్రకటించారు. మూవీ రిలీజ్ డేట్ ఇవ్వడంతో మళ్లీ లోకేష్ రంగంలోకి దిగారు. న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమకున్న అభ్యంతరాలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు నారా లోకేష్. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సినిమా విడుదల నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రామదూత క్రియేషన్స్ కు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌కు, రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఈ నెల 27 కు విచారణ వాయిదా వేసింది. హైకోర్టులో మాత్రం ఈ నెల 26 న విచారణ జరగనుంది. ఒకవైపు లోకేష్ న్యాయపోరాటం చేస్తుండగానే సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు రాంగోపాల్ వర్మ. నిన్న విజయవాడలో వ్యూహం జగగర్జన పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 29 న సినిమా విడుదల అవుతుందని చెబుతూనే చంద్రబాబు, లోకేష్, పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. సినిమాలో ఎలాంటి కల్పితాలు లేవని.. రాజకీయ నాయకుల వాస్తవ పేర్లతోనే సినిమా తీశానని చెప్పుకొచ్చారు.
2009 నుంచి 2019 వరకూ కుట్రలు – ఆలోచనల మధ్య జరిగిన రాజకీయ వ్యూహమే తమ వ్యూహం చిత్రం అన్నారు. సినిమా విడుదలపై లోకేష్ కోర్టుకు వెళ్లడం పెద్ద జోక్ అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్‌ను కోర్టుకు చూపించి న్యాయపరంగా ముందుకెళ్తామని అన్నారు. జగన్‌కు అనుకూలంగానే సినిమా తీశానని చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో బర్రెలక్కకు ఉన్న ఫాలోయింగ్ కూడా లేదన్నారు. ఒక పక్క ఆర్జీవీ మరోపక్క నారా లోకేష్ ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. దీంతో సినిమా విడుదలపై ఉత్కంఠ మొదలైంది. న్యాయపరంగా రూట్ క్లియర్ అవుతుందా? ఏం జరగనుందనే దానిపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..