ప్రమాదంలో పడ్డ నాగార్జున సాగర్‌, శ్రీశైలం డ్యాములు.. లీకేజీ ఆగకపోతే పెను ప్రమాదం తప్పదా..?

నాగార్జున సాగర్‌, శ్రీశైలం డ్యాములు.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అతి పెద్ద ప్రాజెక్టులు. అయితే అవే ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయా? సాగర్‌ స్పిల్‌వేకి ఏమైంది? శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో వాటర్‌ లీకేజీకి కారణం ఏంటి? ఈ డ్యాములకు డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నందుకే కేంద్ర బృందం విజిట్‌ చేసింది. రెండు డ్యాములకు సంబంధించి ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది.

ప్రమాదంలో పడ్డ నాగార్జున సాగర్‌, శ్రీశైలం డ్యాములు.. లీకేజీ ఆగకపోతే పెను ప్రమాదం తప్పదా..?
Nagarjuna Sagar, Srisailam Dam
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Jan 05, 2025 | 8:00 AM

రెండు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తున్న నాగార్జునసాగర్‌ డ్యామ్‌ స్పిల్‌ వేలో పలుచోట్ల డ్యామేజ్ అయింది. ఇలా గుంతలు పడడం కలవరం కలిగిస్తోంది. దీంతో స్పిల్‌ వే పటిష్ఠతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో వాటర్‌ లీకేజీ ఆందోళన కలిగిస్తోంది. 1వ యూనిట్‌ డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ జీరో ఫ్లోర్‌ నుంచి నీటి లీకేజీ జరుగుతోంది. గతేడాది సెప్టెంబరు 18న మొదటిసారి సన్నటి ధారగా లీకేజీ ప్రారంభమైంది. ఈ లీకేజీని అరికట్టకపోతే జీరో ఫ్లోర్‌ శ్లాబ్‌ పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

పలు చోట్ల దెబ్బతిన్న సాగర్‌ స్పిల్‌ వే

ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ డ్యామ్‌ని కేంద్ర జలసంఘం, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు నిపుణుల బృందం పరిశీలించింది. సాగర్‌ డ్యామ్‌ ఇంజినీర్లు గతంలో ప్రతిపాదించిన సుమారు రూ. 160 కోట్ల రూపాయల పనులు, మరమ్మతులు ఎక్కడెక్కడ అవసరమవుతాయో ఆ టీమ్‌ పరిశీలించింది. ఈ పనుల్లో భాగంగా, డ్యామ్‌ స్పిల్‌ వే పటిష్ఠత, గ్యాలరీ, వాటర్‌ లీకేజీలకు సంబంధించిన జియోగ్రాఫికల్‌ విశ్లేషణ, మరమ్మతులు, డ్యామ్‌లో మట్టి పూడికతీతకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను కేంద్ర జలవనరుల శాఖకు అందజేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ జలశక్తి సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని టీమ్‌ సాగర్‌లో పర్యటించింది. ఇదే బృందం శుక్రవారం నాడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి, అక్కడి పరిస్థితులను కూడా అంచనా వేసింది.

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో ఆగని లీకేజీ

ఇక శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో వారం రోజులుగా నీరు లీకవుతుండడం ఆందోళనకరంగా మారింది. నెల రోజుల నుంచి నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పాదనతో పాటు, పంప్‌ మోడ్‌ పద్ధతిలో శ్రీశైలం డ్యామ్‌లోకి నీటి మళ్లింపు కొనసాగుతోంది. పంపు మోడ్‌లో టర్బైన్‌ వేగంగా తిరుగుతుండటంతో.. డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ జీరో ఫ్లోర్‌ శ్లాబ్‌ నుంచి నీటి చుక్కలు ధారలా పడుతుండటంతో జెన్‌కో అధికారులు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే.. సర్జ్‌ ఛాంబర్‌, పెన్‌స్టాక్‌ గేట్లను మూసి వేసి, టర్బైన్‌లో నిలువ నీటిని పూర్తిగా తొలగిస్తే తప్ప లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని గుర్తించే పరిస్థితి లేదంటున్నారు అధికారులు. ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాన్ని 24 ఏళ్ల క్రితం నిర్మించగా.. నీటి లీకేజీని అరికట్టకపోతే జీరో ఫ్లోర్‌ శ్లాబ్‌ పడిపోయే ప్రమాదం ఉందని కొందరు ఇంజనీర్లు, మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన కేంద్రం బృందం..దీనికి ఓ పరిష్కారం సూచించనుంది. నాగార్జున సాగర్‌, శ్రీశైలం డ్యాముల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు పంపనుంది ఈ బృందం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..