Telangana: ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో.. నాగం వర్సెస్ రేవంత్ ఎపిసోడ్
నాగం జనార్ధన్ రెడ్డి.. పాలమూరు జిల్లా లో పరిచయం అక్కరలేని నేత. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎదురులేని ఎమ్మెల్యే. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే అందులో ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బలమైన నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ కురువృద్ధుడైన నాగం జనార్ధన్ రెడ్డి గతమెంతో ఘనం... వర్తమానం శూన్యం. ఒకనాడు టిడిపిలో రాజ్యమేలిన ముఖ్యనాయకుడు...

రాజకీయాలు అంటేనే ఓ సముద్రం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని విచిత్ర పరిస్థితి. ఓడలు బండ్లు అవుతాయి… బండ్లు ఓడలు అవుతాయి. అవును ఈ సామెత మహబూబ్ నగర్ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. సీనియర్ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం ఇందుకు ఓ చక్కని ఉదాహరణ.
నాగం జనార్ధన్ రెడ్డి.. పాలమూరు జిల్లా లో పరిచయం అక్కరలేని నేత. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎదురులేని ఎమ్మెల్యే. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే అందులో ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బలమైన నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ కురువృద్ధుడైన నాగం జనార్ధన్ రెడ్డి గతమెంతో ఘనం… వర్తమానం శూన్యం. ఒకనాడు టిడిపిలో రాజ్యమేలిన ముఖ్యనాయకుడు. అధినేత చంద్రబాబు నాయడుకు అత్యంత సన్నిహతుడు కావడంతో ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలో ఆయన మాటకు తిరుగులేదు. పార్టీ నుంచి టికెట్ కావాలన్న, రాజకీయంగా ఎదగాలన్న నాగం ఆశీస్సులు ఉండాల్సిందే.
అటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువనాయకుడు ప్రస్తుత పీసీసీ చీఫ్.. రేవంత్ రెడ్డి. మొదట టీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ తర్వాత టిడిపిలో చేరారు. ఆ రోజుల్లో జిల్లాలో నాగం జనార్ధన్ రెడ్డి చాలా బలమైన నాయకుడు. రాజకీయ భవిష్యత్ కోసం రేవంత్ రెడ్డి నాగం జనార్ధన్ రెడ్డితో ఎంతో సఖ్యతగా ఉండేవారట. కొడంగల్ అభ్యర్థిత్వం, పార్టీలో క్రియశీలకంగా పనిచేసే అంశంలో నాగం జనార్ధన్ రెడ్డి మద్దతు తప్పనిసరిలా పరిస్థితులు ఉండేవట. అనంతరం తెలంగాణ ఉద్యమం నాగం జనార్ధన్ రెడ్డిని టిడిపి నుంచి బయటకు వచ్చేలా చేసింది. స్వంతంగా తెలంగాణ నగర సమితి పేరుతో పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్ళారు నాగం. ఆ తర్వాత కొద్దిరోజులకే బీజేపీ లో విలీనం చేసి అందులో చేరిపోయారు. అయితే పార్టీలో ఎలాంటి పదవులు, బాధ్యతలు రాకపోవడంతో అనూహ్యంగా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడు ఈ సీనియర్. ఇక రేవంత్ రెడ్డి మాత్రం టిడిపిని అంటిపెట్టుకొని చాలా రోజులు కొనసాగారు.
ఇదే పాలమూరు జిల్లా కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అధికార టిఆర్ఎస్, సిఎం కేసిఆర్‌కు వ్యతిరేకంగా టిడిపి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనూహ్యంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ప్రతిపక్షం బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు సైకిల్ దిగి కారెక్కిన కంగారు పడలేదు. మారిన పరిస్థితుల దృష్ట్యా టిడిపి, టిఆర్ఎస్ దోస్తీ కొనసాగించిన సందర్భంలో సైకిల్ దిగి హస్తం పార్టీలో చేరాడు రేవంత్ రెడ్డి. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించే అంశంలో రేవంత్ పాపులారిటీ అమాంతం పెంచేసింది. ఒకనాడు కాంగ్రెస్ ను ఎన్ని విధాలుగా విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిని చేసేలా మార్చింది.
ఎన్నికల ముందు అన్నీ తానై నడిపిస్తూ ముందుకు సాగుతుంటే… నాటి నాగం జనార్ధన్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కోసం ఎదురుచూసేలా చేసింది కాలం. నేడు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే రేవంత్ రెడ్డి మద్దతు తప్పనిసరి చేసేలా పరిస్థితులు మారిపోయాయి. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి ఏం చెబుతాడోనని వేచి చూద్దాం అనేలా ఈ రాజకీయ కురువృద్దుడిని నిలిపింది కాలం. నాడు రేవంత్ పరిస్థితి ఎలా ఉందో నేడు నాగం పరిస్థితి అలా తయారయ్యింది. ఓడలు బండ్లు అవుతాయి… బండ్లు ఓడలు అవుతాయి అంటే బహుశా ఇదేనేమో. ఏది ఏమైనా రాజకీయం రంగం అంటేనే ఒక అమీబా. ఇందులో విలక్షణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందో ఎవరు ఊహించలేరు. కాలమే అన్ని నిర్ణయిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
