Weather: తెలంగాణలో ‘మాన్సూన్ బ్రేక్’..? జూలై 12 నుంచి 15 వరకు రాష్ట్రంలో
తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన విధంగా కొనసాగడం లేదు. జూలై 15 వరకు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు బలహీనపడటంతో 'మాన్సూన్ బ్రేక్' పరిస్థితులు ఏర్పడి, పలు జిల్లాల్లో 37-40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం అసాధారణంగా కొనసాగుతోంది. సాధారణంగా జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా, ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చగా, జూలై సగానికి చేరుకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, జూలై 15 వరకు తెలంగాణలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనపడటంతో పాటు ‘మాన్సూన్ బ్రేక్’ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతో వర్షాల కంటే ఎండల ప్రభావమే ఎక్కువగా కనిపించనుంది.
జూలై 12 నుంచి 15 వరకు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల తీవ్ర ఉక్కపోత నెలకొని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఎండల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా ఉరుములు, మెరుపులతో కూడిన స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు తెలిపారు. వ్యవసాయ పనులు, సాగునీటి అవసరాలపై కూడా ఈ పరిస్థితి ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఏడాది దేశ వాతావరణంపై ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొంకణ్, మధ్య మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ, తెలంగాణతో పాటు విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాలు ఇంకా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అలాగే రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మాన్సూన్ ప్రారంభంలో కొంత వర్షపాతం నమోదైనప్పటికీ, అనంతరం అక్కడ కూడా వర్షాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం మాన్సూన్ ట్రఫ్ ఉత్తర దిశగా కొనసాగుతుండటంతో ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సాధారణం కంటే మెరుగైన వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణంతో పోలిస్తే 14 శాతం లోటులో ఉంది. రుతుపవనాలు మరింత బలహీనపడితే జూలై చివరి నాటికి ఈ లోటు 20 నుంచి 25 శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జూలై రెండో భాగంలో బంగాళాఖాతంలో కొన్ని అల్పపీడనాలు ఏర్పడే అవకాశమున్నప్పటికీ, వాటి ప్రభావం తెలంగాణపై పరిమితంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి జూలై చివరి పది రోజుల్లో మాత్రమే కొంతమేర విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఒకవేళ ఆ సమయంలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే, రాష్ట్ర ప్రజలు, రైతులు ఆగస్టు నెలపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం
