తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ అధిష్ఠానం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు ‘నేను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వండి. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు, రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తా. నాకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా. రూ. 100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు . కేసీఆర్ ను కొట్టే మొగోణ్ణి నేనేనని జనాలు నమ్మారు. అంతేకాని బీజేపీని చూసి కాదు . నాకంటే ముందు బీజేపీ పోటీచేస్తే వచ్చింది 3,500 ఓట్లు . పదేళ్ళలో పార్టీకోసం నాకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదు. నేను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారు’ అని రఘునందర్ రావు ఆఫ్ ది రికార్డుగా పేర్కొన్నట్లు సమాచారం.
ఇక బీజేపీ అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలపై కూడా ఎమ్మెల్యే స్పందించినట్లు తెలుస్తోంది. ‘బండి సంజయ్ ది స్వయంకృతాపరాధం. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేసిన సంజయ్ కి వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిది. పార్టీ డబ్బులో నాకు వాటా ఉంది. తరుణ్ చుగ్ బొమ్మలు కాదు రఘునందన్, ఈటెల బొమ్మలుంటే ఓట్లు వేస్తారు. పార్టీ గుర్తు చివరి అంశమే. జీహెచ్‌ఎంసీ ప్లోర్ లీడర్ కావాలని దేవర కరుణాకర్ అనే వ్యక్తి అడిగిఅడిగి చనిపోయాడు . పార్టీకి శాశనసభపక్ష నేత లేడనే విషయం నడ్డాకు తెలియదు . ఆ విషయమై ప్రశ్నిస్తే అదేంటి అంటూ నన్నే నడ్డా అడిగారు. బండి సంజయ్ మార్పుపై మీడియాలో వస్తున్నవన్నీ నిజాలే’ అని రఘునందన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది.