Telangana: మహిళలకు శుభవార్త.. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇచ్చేది ఎప్పుడంటే..?
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అప్పుల విషయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలను సరికావన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సంక్షేమం కోసం నిధులను వెచ్చిస్తున్నామన్నారు.
తాను సైలెంట్ కిల్లర్‌ను కాదు.. చురుకైన కాంగ్రెస్ కార్యకర్త అని తేల్చి చెప్పారు తెలంగాణ మంత్రి శ్రీధర్‌భాబు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో సాగుతున్న కాంక్లేవ్‌లో మంత్రి మనసు విప్పి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పదేళ్లపాటు యువత పడిన వేదన వర్ణనాతీతమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలిచ్చామన్నారు. ఏడాది కూడా టైమ్ ఇవ్వకుండా హామీలపై విపక్షాల విమర్శలు సరికాదన్నారు.
ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీమేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పదేళ్ల బీఆర్‌ఎస్ కాలంలో ఇలాంటి మెకానిజం జరగలేదన్నారు. రైతులకు రెండులక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే సొంతమన్నారు. అధికారంలోకి వచ్చిన మూడోరోజే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిత్యం లక్షలమంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తున్నామని గర్వంగా చెప్పారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు కసరత్తు జరుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయని ఎన్నోపనులను కాంగ్రెస్ ఏడాదిలోనే చేసిన విషయం గుర్తుచేశారు మంత్రి. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నం బియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. హామీల అమలుకు కొంత టైమ్ పడుతుందన్న శ్రీధర్‌బాబు.. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం లాంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని టీవీ9తో శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు తరలిపోతున్నాయనేది పూర్తిగా అబద్ధమన్న మంత్రి, గత ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు సైతం సకల సదుపాయలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. రియల్‌ఎస్టేట్‌లో ఇప్పటికీ హైదరాబాద్ టాప్ పొజిషన్‌లో ఉందని తెలిపారు. ప్రపంచంలోనే రియల్ ఏస్టేట్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డ్ సృష్టిస్తోందన్నారు. ఏడాదైనా టైమ్ ఇవ్వకుండా మాపై విమర్శలా..? బీఆర్ఎస్ నేతలు బురద చల్లడం మానుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..