Telangana Politics: కాంగ్రెస్‌ను ఎంఐఎం కావాలనే టార్గెట్ చేస్తోందా.. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏం జరిగింది..
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మైనారిటీ ఓట్లు అత్యంత కీలకం. మైనారిటీ ఓట్లతో గెలిచే ఎంఐఎం కంచుకోటలను దాదాపుగా బద్దలుకొట్టడం కష్టమే. అయితే, మిగిలిన స్థానాల్లో మాత్రం ఎంఐఎం ఎవరికి ఓటువేయమంటే మైనారిటీలు ఆ పార్టీకే ఓటు వేస్తారు. ఒకప్పుడు ఎంఐఎం, కాంగ్రెస్ మంచి దోస్తులు. మైనారిటీ ఓటు కాంగ్రెస్‌కే వెళ్లింది. ఆ తరువాత ఆ ప్లేస్‌లోకి బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని అసదుద్దీన్ ఆల్రడీ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. కాని ఎంఐఎం చెప్పినంత మాత్రాన ఈసారి మైనారిటీ ఓటు టర్న్ అవుతుందా..

ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని అసదుద్దీన్ ఆల్రడీ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. కాని ఎంఐఎం చెప్పినంత మాత్రాన ఈసారి మైనారిటీ ఓటు టర్న్ అవుతుందా? ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? ఈ అనుమానం ఎంఐఎంకు కూడా ఉంది కాబట్టే కాంగ్రెస్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు ఇప్పుడు కాంగ్రెస్ వైపే కన్సాలిడేట్ అయ్యేలా కనిపిస్తోందని కొన్ని గణాంకాలు కూడా చెబుతున్నాయి.
అందులోనూ ఎంఐఎం పార్టీ పలు రాష్ట్రాల్లో అభ్యర్ధులను పోటీకి దించుతున్నా గెలవలేకపోతోంది. ఈమధ్య ఎంఐఎం ఓట్ షేర్ కూడా విపరీతంగా తగ్గింది. ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయడం అంటే.. పరోక్షంగా బీజేపీ గెలుపుకు సహకరించడమేనన్న టాక్ బలంగా వెళ్లింది. అందుకే, ఎంఐఎంకు నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పోటీ ఉంటుంది. అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ చాలా కీలకం. బీజేపీని దెబ్బతీయడం కోసం యూపీలో ఎంఐఎం అభ్యర్దులను నిలబెట్టినప్పటికీ అది సమాజ్‌వాదీ పార్టీకి నష్టం తెచ్చింది. అంతిమంగా బీజేపీ లాభపడింది.
అందుకే, బెంగాల్‌లో ఎంఐఎంను ఆదరించకుండా తాము అనుకున్న పార్టీకే మైనారిటీలు ఓట్లు వేశారు. అటు కర్నాటక ఎన్నికల్లోనూ అదే జరిగింది. అంటే.. ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం వ్యూహం బెడిసికొడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం మైనారిటీ ఓటర్లలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు షిఫ్ట్ అవుతున్నాయి. ఈ పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాంగ్రెస్ కూడా మైనారిటీ ఓట్లు తమవైపు షిఫ్ట్ అవుతోందన్న విషయం కనిపెట్టింది. దానికి అనుగుణంగానే వ్యూహరచన చేస్తోంది. పైగా తెలంగాణలో ఒకప్పుడు మైనారిటీ ఓటు కాంగ్రెస్ వెంటే నడిచింది. దీనికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకురావడాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు మైనారిటీలు. ఆ తరువాత ఆ ఓటు బ్యాంక్ మొత్తం బీఆర్‌ఎస్‌కు షిఫ్ట్ అయింది. అయితే, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఓ స్ట్రాటజీతో వెళ్తోంది.
దానికి తగ్గట్టే తెలంగాణలో కొన్ని పరిణామాలు కూడా జరిగాయి. బీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతు తెలపడంతోపాటు బీజేపీకి అనుకూలించేలా మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. అందుకే, ఎంఐఎం చెప్పినా సరే ఆ ఓట్లు కాంగ్రెస్‌కే వెళ్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఓల్డ్ సిటీపై కన్నేసింది కాంగ్రెస్.
సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో ఓల్డ్ సిటీకి చెందిన మస్కతి డెయిరీ చైర్మన్ అలీ బిన్ ఇబ్రహీం మస్కతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పాతబస్తీలో స్థానికంగా పలుకుబడి ఉన్న మహ్మద్ అయూబ్ ఖాన్ అలియాస్ అయూబ్ తన కుమారులు షాబాజ్ ఖాన్, అర్బాజ్ ఖాన్‌తో కలిసి పార్టీలో చేరారు. ఇదే బాటలో టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీఖాన్ సైతం కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం వినిపిస్తోంది. వీరితోపాటు మరికొంత మంది నాయకులను పార్టీలో చేర్చుకునేలా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.
మరోవైపు తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ముస్లింలలోనే ఎక్కువ చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ముస్లిం పెద్దల్లోని కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఎంఐఎం.. ఓ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోందని చెబుతున్నారు. అందులో భాగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్ నేతల మాటలపై ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి RSS నుంచి వచ్చారని, అవునో కాదో భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలంటూ సవాల్ విసిరారు.
అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలవాలని రాహుల్ గాంధీకి సవాల్ చేశారు. గెలిచేది షేర్వానీనా, టోపీనా అన్నది తేలిపోతుందన్నారు.
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం విరుచుకుపడడానికి కారణం విశ్లేషిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. వాళ్లకు దొరికిన సమాధానం, చేస్తున్న విశ్లేషణ ప్రకారం.. దేశవ్యాప్తంగా మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించే కాంగ్రెస్ మీద ఎంఐఎం దాడి పెంచిందని చెబుతున్నారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీని ఎంపీ అసదుద్దీన్, రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టార్గెట్ చేసి మాట్లాడారంటున్నారు. మున్ముందు ఎంఐంఎ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతుందా, మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉంటారన్నది వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం




