Bandi Sanjay: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వెంటనే పునరుద్ధరించాలిః బండి సంజయ్
: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
Bandi Sanjay on Mid Day Meals Scheme: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈమేరకు బండి సంజయ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మా పిల్లలు తినే బియ్యాన్నే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తింటున్నారని పదేపదే గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ పిల్లలు పస్తులుండటాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారని బండి సంజయ్ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు గౌరవ వేతనాన్ని వెంటనే పెంచాలన్నారు.
కాగా, మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే ఆహార ధాన్యాలను, వాటి రవాణాకయ్యే ఖర్చునూ 100 శాతం కేంద్రమే చెల్లిస్తోందన్న బండి సంజయ్.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లిస్తున్న గౌరవ వేతనంలోనూ 60 శాతం కేంద్రమే చెల్లిస్తోందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచకుని ఇతర రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచుతూ అందుకయ్యే వ్యయాన్ని అక్కడి రాష్ట్రాల ప్రభుత్వాలే భరిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల కనీస గౌరవ వేతనాన్ని పెంచాలని విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్నారు.
Read Also… School Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్‌లో పోర్న్ వీడియోల కలకలం.. టీచర్‌పై కేసు నమోదు..!