Telangana: వణికిస్తున్న చలి పులి.. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రం..

తెలంగాణలో చలిగాలులు పెరుగుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచే స్టార్ట్ అవుతున్న శీతల గాలులు...

Telangana: వణికిస్తున్న చలి పులి.. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రం..
Winter In Teslangana
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 03, 2022 | 6:44 AM

తెలంగాణలో చలిగాలులు పెరుగుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచే స్టార్ట్ అవుతున్న శీతల గాలులు ఉదయం పది గంటలైనా తగ్గుముఖం పట్టడం లేదు. మరోవైపు.. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సముద్రంలో డిసెంబర్‌ 4న ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో డిసెంబర్‌ 5 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు, రాజధాని పరిసర ప్రాంతాలు, జిల్లా్ల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పొగ మంచు కమ్ముకోవడం వల్ల రహదారులపై రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే ఐదురోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆదిలాబాద్‌లో 13.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌ 21 డిగ్రీలు, భద్రాచలంలో 22, ఖమ్మం 20 డిగ్రీలు, హనుమకొండ, నల్గొండలో 19 డిగ్రీలు, దుండిగల్‌ 18.7 డిగ్రీలు, హైదరాబాద్‌ 18.4 డిగ్రీలు, నిజామాబాద్‌ 17.6 డిగ్రీలు, రామగుండం 17.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఆవర్తనం డిసెంబర్‌ 7 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇక తుఫాను ఆవర్తనం కారణంగా చలి మరింత పెరగనుందని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు.. తెలంగాణలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. అర్ధరాత్రి తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయి చల్లబడుతోంది. ఉదయం జామున చలిగాలుల ఉధృతి పెరగడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉదయాన్నే రోడ్లు పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఉదయం బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..