Medaram Jatara: వనమెల్లా జనమే.. గద్దెపైకి సారలమ్మ.. మేడారంలో అద్భుత దృశ్యం..
వనమెల్లా జనం.. నిలువెల్లా బంగారంతో జంపన్నవాగులో భక్తి ప్రవాహంగా మారింది.. అడవి తల్లి పులకించింది.. మేడారం మట్టి పసుపువర్ణమై మెరిసింది. కుంకుమల పరిమళంతో మేడారం ఆధ్యాత్మిక కోలాహలంగా మారిపోయింది. నేలతల్లి పులకించేలా.. మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం.. ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతం అయింది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపై కొలువుదీరింది.

మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతం అయింది. కన్నెపల్లి నుంచి డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, లక్షలాది భక్తుల నీరాజనాల నడుమ సారలమ్మ గద్దెపైకి తీసుకువచ్చారు పూజారులు. అటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరిగింది. ఇక రేపు సాయంత్రం జాతరలో మరో అద్భుత ఘట్టం..! చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో.. జాతర తారాస్థాయికి చేరుకుంటుంది.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జంపన్నవాగు జనసంద్రంగా మారింది. ‘సల్లంగ సూడు తల్లీ’ అంటూ.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. తమ కోర్కెలు తీర్చమని అమ్మవార్లకు చీర, సారెతో పాటు నిలువెత్తు ‘బంగారం’ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ.. నిరంతరం భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టింది.
లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
