AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఉన్నావేంట్రా బాబూ.. మెదక్ జిల్లాలో వింత చోరీ.. వెళ్తూ వెళ్తూ దొంగ ఏం చేశాడంటే..

మెదక్ జిల్లా చేగుంటలో వింత దొంగతనం వెలుగుచూసింది. నవదుర్గ హోటల్‌లోకి అర్ధరాత్రి చొరబడిన ఓ గుర్తుతెలియని వ్యక్తి సుమారు 300 మీటర్ల కేబుల్ వైరును కట్ చేసి ఎత్తుకెళ్లాడు. అంతేకాకుండా కిచెన్‌లోని పెరుగు డబ్బా, మరికొన్ని కిరాణా వస్తువులను కూడా తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్వాహకుల ఫిర్యాదుతో చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా ఉన్నావేంట్రా బాబూ.. మెదక్ జిల్లాలో వింత చోరీ.. వెళ్తూ వెళ్తూ దొంగ ఏం చేశాడంటే..
Medak Theft Case
P Shivteja
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 5:25 PM

Share

మెదక్ జిల్లాలో ఇటీవల వింత చోరీలు ప్రజలను, పోలీసులను విస్మయానికి గురిచేస్తున్నాయి. విలువైన వస్తువులతో పాటు సిల్లీగా అనిపించే వస్తువులను కూడా దొంగిలిస్తూ.. దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా చేగుంట మండల కేంద్రంలో ఇలాంటిదే ఒక విచిత్రమైన దొంగతనం వెలుగు చూసింది. చేగుంటలోని నవదుర్గ హోటల్‌లో అర్ధరాత్రి సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని హోటల్‌ ప్రాంగణంలోకి ప్రవేశించిన సదరు దొంగ, అక్కడ దొరికిన వస్తువులను సర్దేశాడు. ఈ చోరీలో దొంగ సుమారు 300 మీటర్ల పొడవైన కేబుల్ వైరును కత్తిరించి ఎత్తుకెళ్లాడు. అంతవరకు బాగానే ఉన్నా, వెళ్తూ వెళ్తూ హోటల్‌లో ఉన్న ఒక పెరుగు డబ్బాను, మరికొన్ని చిన్నపాటి కిరాణా వస్తువులను కూడా వదలకుండా పట్టుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

కేబుల్ వైరు సరే.. పెరుగు డబ్బా ఎందుకు దొంగిలించాడో.. అని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా, ఈ వింత దొంగతనం అంతా హోటల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ముఖానికి ముసుగు ధరించిన దొంగ.. లోపలికి ప్రవేశించడం, కేబుల్ వైరును కట్ చేయడం, ఆ తర్వాత కిచెన్ వైపు వెళ్లి వెతుకుతూ పెరుగు డబ్బాను పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం వంటి దృశ్యాలు సీసీటీవీ విజువల్స్‌లో కనిపించాయి. ఈ విజువల్స్ ఇప్పుడు స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వీడియో చూడండి..

ఉదయాన్నే హోటల్ తెరిచిన నిర్వాహకులు లోపల జరిగిన అస్తవ్యస్త పరిస్థితిని చూసి షాక్‌కు గురయ్యారు. కేబుల్ వైరు, ఇతర వస్తువులు మాయమవ్వడంతో వెంటనే చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వింత దొంగతనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us