Medaram Jatara: మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటి.. ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?
మేడారం మహాజాతరకు సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించే తొలిఘట్టం మండమేలిగే పండుగ మహా వైభవంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆ కార్యక్రమం నిర్వహించారు. దృష్టశక్తుల చూపు మేడారం వైపు పడకుండా దిగ్బంధం చేసి కోడిపిల్లను బలిచ్చి ఊరుకట్టు నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకతో మేడారం జాతర ప్రారంభమైనట్టే భావిస్తారు. మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు అమ్మవార్లు వనం నుండి జనంలోకి వస్తారు.

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తోంది. జనవరి 28 నుండి 31వ తేదీ వరకు మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతల గద్దెలపై కొలువు దేరే గడియలు ఆసన్నం అవుతున్నాయి. మహా జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు ఆదివాసీలు ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే మండమెలిగే పండుగ ముగిసింది. ఈ సందర్భంగా సమ్మక్క సారక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. మేడారంలో సమ్మక్క తల్లి, కన్నెపల్లిలో సారలమ్మ. పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజు ఆలయాల్లో ఆదివాసీలు పూజలు నిర్వహించారు. మండమెలిగే వేడుకలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం మేడారం పొలిమేరల్లో పూజారులు దిష్టి తోరణాలు కట్టారు. కోడిపిల్లను బలిచ్చి ఊరు చుట్టూ తోరణాలు కట్టడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు దరి చేరవని ఇక్కడి పూజారుల విశ్వాసం.
మేడారం పొలిమేరల్లో మామిడి, తునికి ఆకులతో తోరణాలు కట్టారు. ఊరు చుట్టూ చలిగంజి, అంబలితో కట్టు పోస్తారు. ఆ తరువాత సమ్మక్క సారలమ్మకు సంబంధించిన పూజా సామగ్రిని మేడారం గద్దెలపైకితీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. పసుపు, కుంకుమలతో పూజలు చలపయ్య మొక్కులు సమర్పిస్తారు. ఆ తరువాత పూజారులంతా. అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి, పూజా కార్యక్రమాలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరిస్తారు. ఈ తంతు నిర్వహించడం ద్వారా జాతరకు అంకురార్పణ జరిగినట్లు బావిస్తారు. పూజలు పూర్తయిన తర్వాత జాగారాలు కూడా చేపడుతారు. ఈ సందర్భంగా ఇవ్వాల రాత్రి నుండి రేపు తెల్లవారుజాము వరకు అమ్మవారి గద్దెల వద్దకు భక్తులు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు.
మండెమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్టేనని భావిస్తారు. పుట్టమట్టితో అలికి ముగ్గులు కూడా వేశారు. సమ్మక్క- సారలమ్మ ఆయుధాలు, గజ్జెలు, కత్తులు, కుంకుమ భరిణెలు, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేస్తారు. అనంతరం మేడారం లోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు.. అక్కడి నుంచి సమ్మక్క గుడికి వెళ్లి గిరిజన ఆడపడుచులు పూజలు చేస్తారు. ఆ తరువాత గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
