Telangana: గర్భవతుల్ని చేసి, అందినకాడికి దండుకుని పరార్.. ఏకంగా 8మందిని ట్రాప్ చేసిన జాదూగాడు
పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తూ వస్తున్న ఘరానా మోసగాడి బాగోతం వెలుగులోకి వచ్చింది. మాట్రిమోనియల్ సైట్ల ద్వారా ట్రాప్ చేసే మాయగాడి గురించి అతడి చేతిలో మోసపోయిన మహిళలే గొంతెత్తారు.
Crime News: నమ్మితే చాలు నట్టేట ముంచేస్తాడు.. పెళ్లి పేరుతో ఆశలు రేపి అగాధంలో పడేస్తాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మందిని మోసం చేశాడు.. దీంతో న్యాయం కావాలని వేడుకుంటున్నారు బాధితులు. మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా ఆడపిల్లలకు వలవేస్తాడు నిత్య పెళ్లికొడుకు. రిజిస్టర్ పెళ్లిళ్లు చేసుకుంటూ వారితో సంసారం చేసి గర్భవతులను చేసిన తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బునంత జేబులో వేసుకొని ఉడయించడం అతగాడి నైజం. ఇలా మోసపోయిన 8 మంది తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్(Hyderabad)లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన చీటర్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెళ్లిళ్ల పేరుతో 8 మందిని అమ్మాయిలను మోసం చేసిన నిందితుడి పేరు శివశంకర్‌బాబు. గుంటూరు జిల్లా వేదపూడి గ్రామం. ఈ మోసగాడి చేతిలో మరొక ఆడపిల్ల మోసపోవద్దనే ఉద్దేశంతో తాము మీడియా ముందుకి వచ్చామని బాధితులు చెబుతున్నారు. ఇప్పుటికైనా పోలీసు యంత్రాంగం మోసగాడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టాలని కోరుతున్నారు.