
హైదరాబాద్, ఏప్రిల్ 7: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ భూసేకరణ పరిహారంలో మహా కుంభకోణం వెలుగుచూసింది. ఏకంగా రూ.22.31 కోట్ల భారీ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నలసోపారాకు చెందిన మాయా చవాన్ అనే నిరక్షరాస్యురాలైన మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ భారీ మోసానికి తెరలేపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఆమె భూమిని ప్రభుత్వం సేకరిస్తోందని, రికార్డులు సరిచేస్తామని ముందుగా నమ్మబలికారు. రికార్డుల్లో తప్పులు ఉన్నాయని భయపెట్టి ఆ మహిళ నుంచి సంతకాలు, వేలిముద్రలు సేకరించారు. ఉమేష్ హరిహర్ రాణా ఈ మొత్తం కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. అతడితో పాటు సంజయ్ జోషి, అస్లాం సరోజియా, వేణు గోపాల్ తదితర ఎనిమిది మంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
పక్కా ప్రణాళికతో మహిళ పేరిట పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకుని భూమి పత్రాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. భూమికి సంబంధించిన కీలక రికార్డులను మార్చేసిన నిందితులు, పరిహారం పొందేందుకు మాయా చవాన్ పేరిట ఒక బ్యాంకు ఖాతాను తెరిచారు. ఆ ఖాతాకు బాధితురాలి మొబైల్ నంబర్ కాకుండా తాము దొంగతనంగా తీసుకున్న మరో సిమ్ కార్డు నంబర్‌ను అనుసంధానం చేశారు. దీని ద్వారా బ్యాంకు నుంచి వచ్చే సందేశాలను సులభంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బాధితురాలికి ఏమాత్రం అనుమానం రాకుండా ఆమె నుంచి ముందే కొన్ని ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డును కూడా ఆ ముఠా సభ్యులే తమ వద్ద అట్టిపెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో భూమి పరిహారం సొమ్ము ఖాతాలో పడగానే తమ అసలు వ్యూహాన్ని అమలు చేశారు. మాయా చవాన్ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.22.31 కోట్లను ప్రభుత్వం పరిహారంగా జమ చేసింది.
ఫోన్ నంబర్, ఏటీఎం కార్డు, చెక్కులు తమ వద్దే ఉండటంతో నిందితులు ఆ మొత్తం డబ్బును వివిధ అకౌంట్లకు క్షణాల్లో బదిలీ చేశారు. ఒక్క రూపాయీ ఆ మహిళకు దక్కకుండా మొత్తం పరిహారం సొమ్మును కొల్లగొట్టారు. తన ఖాతాలో పడాల్సిన కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియక అయోమయానికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు బృందాలు ఫోర్జరీ పత్రాలు, నకిలీ సిమ్ కార్డుల ఆధారంగా తీగ లాగారు. ఈ క్రమంలో ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న ఎనిమిది మంది కరడుగట్టిన మోసగాళ్ల వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. పోలీసుల కళ్లుగప్పి ముంబై నుంచి పరారైన ప్రధాన నిందితుడు ఉమేష్ రాణా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సాంకేతిక ఆధారాలతో అతడి లొకేషన్‌ను ట్రేస్ చేసిన దర్యాప్తు అధికారులు అతడు హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు కనిపెట్టారు. ప్రత్యేక బృందాలతో దాడి చేసి మాస్టర్ మైండ్‌ను అరెస్ట్ చేయడంతో ఈ బుల్లెట్ ట్రైన్ భూ కుంభకోణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.