మృత్యువుతో పోరాడిన మూడు రోజుల చిన్నారి.. దేవుడిలా వచ్చి ఊపిరి పోసిన ‘108’ సిబ్బంది!
108 అంబులెన్స్ సిబ్బంది చూపిన మానవీయ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. సమయానికి స్పందించి సీపీఆర్ (Cardio Pulmonary Resuscitation) అందించడం ద్వారా ఓ నవజాత శిశువుకు ప్రాణం పోశారు. శ్వాస సంబంధిత సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న మూడు రోజుల చిన్నారికి అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై పునర్జన్మ ప్రసాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

108 అంబులెన్స్ సిబ్బంది చూపిన మానవీయ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. సమయానికి స్పందించి సీపీఆర్ (Cardio Pulmonary Resuscitation) అందించడం ద్వారా ఓ నవజాత శిశువుకు ప్రాణం పోశారు. శ్వాస సంబంధిత సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న మూడు రోజుల చిన్నారికి అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై పునర్జన్మ ప్రసాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తుంకిమెట్ల గ్రామానికి చెందిన భువనేశ్వరి అనే మహిళ మూడు రోజుల క్రితం తాండూర్‌లోని మాతా-శిశు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కొద్ది రోజులకే ఆ బాబుకు తీవ్రమైన శ్వాస సమస్య తలెత్తింది. చిన్నారి పరిస్థితిని గమనించిన తాండూర్ వైద్యులు, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.
వైద్యుల సూచనతో కుటుంబ సభ్యులు నవజాత శిశువును తీసుకుని 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో చిన్నారి పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. బాబు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఊపిరి ఆడక ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో అంబులెన్స్‌లో ఉన్న 108 ఈఎంటి (EMT) శాంత్ కుమార్, పైలట్ అయూబ్ పాషా అత్యంత సమయస్ఫూర్తితో స్పందించారు.
పరిస్థితి చేతులు దాటిపోకముందే అప్రమత్తమైన సిబ్బంది, క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిన్నారికి అత్యవసరంగా సీపీఆర్ నిర్వహించారు. చిన్నారి గుండె చప్పుడు, శ్వాసను పునరుద్ధరించేందుకు వారు చేసిన వేగవంతమైన, నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. కొద్దిసేపటికే చిన్నారి కోలుకుని, పరిస్థితి మెరగుపడింది. అనంతరం ఆ బాబును సురక్షితంగా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న బిడ్డను బతికించి, దేవుడిలా నిలిచిన 108 సిబ్బంది శాంత్ కుమార్, అయూబ్ పాషాలకు చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అంబులెన్స్ సిబ్బంది చాకచక్యాన్ని, సమయస్ఫూర్తిని చూసి నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది చూపిన అప్రమత్తత, సేవాభావం వైద్య అత్యవసర సేవల ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
