AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ టు కడప.. వయా జడ్చర్ల.. నోట్ల కట్టలు మాయం చేసి వాటర్ బాటిల్స్ పెట్టారు.. చివరకు..

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ నెల 16వ తేదీన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చోరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్‌కు చెందిన టీఎస్ ట్రాన్స్కో ఉద్యోగి దామోదర్ రూ.36లక్షల నగదుతో హైదరాబాద్ నుండి ఆర్టీసి బస్సులో కడప నగరానికి వెళ్తున్నాడు. తన చెల్లెలి అవసరాల కోసం పిఎఫ్, సేవింగ్స్ డబ్బులను మొత్తం బ్యాగ్‌లో సర్దుకొని ప్రయాణమయ్యాడు.

హైదరాబాద్ టు కడప.. వయా జడ్చర్ల.. నోట్ల కట్టలు మాయం చేసి వాటర్ బాటిల్స్ పెట్టారు.. చివరకు..
Crime News
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jul 31, 2024 | 9:27 AM

Share

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ నెల 16వ తేదీన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో చోరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్‌కు చెందిన టీఎస్ ట్రాన్స్కో ఉద్యోగి దామోదర్ రూ.36లక్షల నగదుతో హైదరాబాద్ నుండి ఆర్టీసి బస్సులో కడప నగరానికి వెళ్తున్నాడు. తన చెల్లెలి అవసరాల కోసం పిఎఫ్, సేవింగ్స్ డబ్బులను మొత్తం బ్యాగ్‌లో సర్దుకొని ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో బయలుదేరాడు. బ్యాగ్ లో డబ్బు ఉందని ఎవరికి అనుమానం రాకూడదని పైన లగేజ్ ర్యాక్‌లో పెట్టి కూర్చున్నాడు. టీ విరామం కోసం జడ్చర్ల బస్టాండులో బస్సును నిలిపారు. ఇక అందరూ బస్సు దిగుతున్న క్రమంలో దామోదర్ బ్యాగ్ ను ఒకసారి చెక్ చేశాడు. దీంతో గుండెలు పగిలేలా షాక్ తగిలింది. నోట్ల కట్టలు ఉండాల్సిన బ్యాగ్ లో వాటర్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. నగదు అపహరణ గురైందని తెలుసుకున్న దామోదర్. వెంటనే జడ్చర్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జడ్చర్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

బస్సును జడ్చర్లలో నే నిలిపివేసి.. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వారిని వేరే ఇంకో బస్సులో స్వస్థలాలకు పంపించారు. ఇక బస్సులోని సీసీ కెమెరాను చెక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సీసీ కెమెరా ఆన్ లేకపోవడంతో పోలీసులకు కేసు సవాల్ గా మారింది. బాధితుడు దామోదర్ అనుమానం వ్యక్తం చేసిన ప్రయాణికులను పోలీసులు ఆరా తీశారు. అలాగే బస్సు ప్రారంభమైన నాటి నుంచి అన్ని పరిస్థితులపై విచారణ జరిపారు. జడ్చర్ల బస్ స్టాండ్ రాకముందే ఇద్దరు వ్యక్తులు బస్సు దిగి వెళ్లిపోయారు. వారిని లక్ష్యంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జడ్చర్లలో బస్సు దిగగానే మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. నిందితులు ఆరంఘర్ వద్ద బస్ దిగినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఇక మహా నగరంలోని సీసీ కెమెరాలతో నిందితుడి మూమెంట్ ను ట్రాక్ చేసిన పోలీసులు చోరీ చేసిన సొత్తుతో స్వస్థలాలకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అంతకుముందు పహాడీషరీఫ్ ప్రాంతంలో ఒకరోజు తలదాచుకున్నట్లు గుర్తించారు.

ఉత్తరప్రదేశ్ కు ప్రత్యేక బృందం..

ఇక నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించి పోలీసులు ప్రత్యేక బృందంతో వెళ్లి వారిని అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి.. నేరుగా జడ్చర్లకు తీసుకువచ్చారు. నిందితుల నుంచి రూ.29లక్షల 75వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నగదులో రూ.6లక్షలు స్వంత అవసరాలకు వాడుకున్నారు. ఇక మిగిలిన డబ్బుతో స్వగ్రామంలో భూమి కొనుగోలు చేయాలని భావించారు. ఇక పట్టుపడ్డ నిందితుల్లో దిల్షాద్, షారుక్ లను రిమాండుకు తరలించారు. మరో నిందితుడు సత్తార్ కు అనారోగ్య సమస్యలు ఉండడంతో నోటీసులను అందజేసినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..