Congress Joinings: హస్తం గూటికి రాజగోపాల్ రెడ్డి.. ఆయనతో పాటు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరారు. గురువారం రాత్రి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరారు. గురువారం రాత్రి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
గురువారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న రాజగోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి మధ్యాహ్నం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఆయనతో సుమారు 40 నిమిషాల పాటు మంతనాలు సాగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీలో కసరత్తు చేస్తున్న సమయంలోనే ఈ ముగ్గురు నేతలు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశాలు నిర్వహించారు.
అయితే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పినట్టు సమాచారం. కేసీ వేణుగోపాల్‌తో పాటు మరికొందరు పార్టీ పెద్దలను ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. గురువారం రాత్రి గం. 9.30 సమయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం వారంతా మహారాష్ట్ర సదన్‌లో మాణిక్ రావ్ ఠాక్రేను కలిశారు. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం గం. 9.30కు కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉన్నందున.. టికెట్ ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలు ఆ సమయానికి పార్టీలో చేరి ఉంటేనే అభ్యర్థిత్వాలను పరిశీలించడం సాధ్యపడుతుందని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలనుకున్న రాజగోపాల్ రెడ్డి తదితరులు గురువారం రాత్రే పార్టీ కండువగా కప్పుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం గం. 9.00కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో రాజగోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం ఖర్గే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం లోగా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగించి, టీ-కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నట్టు తెలిసింది. అక్టోబర్ 28 నుంచి ప్రారంభించనున్న కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నేపథ్యంలో నేతలు కసరత్తును శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు సంబంధించిన వర్క్ అవుట్ కూడా పూర్తి చేసినట్టు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…