Telangana: తెలంగాణలో ఇంట్లో దావత్ చేసుకుంటుంటే ఎంత మద్యం కలిగి ఉండొచ్చు..?
తెలంగాణ రాష్ట్రంలో.. ఇంట్లో లిక్కర్ పార్టీ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా, ఆ పార్టీలో ఎంత మద్యం ఉండొచ్చు... ఎక్సైజ్ శాఖ రూల్స్ ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....
మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన దావత్ ఇటీవల తెలంగాణలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అక్కడ కర్ణాటక లిక్కర్‌తో పాటు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఏడు లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. అక్కడ విదేశీ మద్యం బాటిల్స్ దొరకడంతో పాటు.. ఒక వ్యక్తికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో.. అక్కడ రేవ్ పార్టీ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్న దావత్ అంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఈ క్రమంలోనే ఎక్కువమంది లిక్కర్ పార్టీ పాల్గొన్నప్పుడు కూడా చట్టప్రకారం అనుమతులు తీసుకోవాలని అధికారులు చెప్పిన మాటల నెట్టింట బాగా ట్రెండ్ అయ్యాయి. అసలు తెలంగాణలో ఒక వ్యక్తి ఎంత మద్యం కలిగి ఉండొచ్చు.. నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్-1968లో పొందుపరిచన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో లిక్కర్ తయారీ, అమ్మకాలు వంటివి ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉంటాయి. ఒక వ్యక్తి… 6 ఫుల్ బాటిళ్ల లిక్కర్ అంటే… 4.5 లీటర్లు, 12 బీర్లు కలిగి ఉండే వెసులుబాటు ఉంది. అయితే ఫ్యామిలీ పార్టీ చేసుకునేటప్పుడు.. మందు పార్టీ చేసుకోవడానికి 6 బాటిళ్ల కంటే ఎక్కువ లిక్కర్ కొనుగోలు చేయాల్సి వస్తే, ఆ పార్టీ ఇచ్చే వ్యక్తి ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వివరాలతో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెట్టుకుంటే.. ఉన్నతాధికారులు పరిశీలించి పర్మిట్స్ జారీ చేస్తారు. అనుమతి సాధారణంగా 48 గంటల్లో జారీ చేయబడుతుంది.
అయితే ఈ పార్టీ నిర్వహణ అనుమతి కోసం చలాన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. GHMC పరిధిలో కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 9వేల రూపాయలు, అదే 4 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో పార్టీ చేసుకుంటే 12 వేల రూపాయలు చెల్లించాలి. GHMCతో పాటు 5 కిలోమీటర్ల పరిధిలో ఒక రోజుకు 12 వేల రూపాయలు కట్టాలి. 4 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లోహోటళ్లలో పార్టీ నిర్వహిస్తే 20 వేల రూపాయలు చెల్లించాలి. హాజరయ్యే వారి సంఖ్యను బట్టి ఈ చలాన్ అమౌంట్ పెరుగుతుంది.
ఉదాహారణకు సదరు పార్టీకి 1000 మంది హాజరవుతుంటే.. 50 వేల రూపాయలు చలాన్ కట్టాలి, ఐదు వేల మంది హాజరయ్యే ఈవెంట్‌కు లక్ష రూపాయలు, ఓపెన్ గ్రౌండ్స్‌లో ఐదు వేలకు మించి హాజరయ్యే ఈవెంట్స్, ఫంక్షన్స్‌కు రూ.2.5 లక్షలు చలాన్ కింద పే చేయాల్సి ఉంటుంది.