ఈ రోజుల్లో చాలా అరుదు.. ఆ గ్రామానికి ఏకదంతుడు ఒక్కడే..
వినాయక చవితి నవరాత్రులతో.. ఎక్కడా చూసినా గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. పట్టణాలు, గ్రామాల్లో గల్లీకో వినాకుడి విగ్రహాన్ని పెట్టి హంగామా చేయడం చూస్తుంటాం. చుట్టు పక్కల తమదే పెద్ద విగ్రహంగా ఉండాలని పోటీపడి మరీ భారీ లంబోదరుడిని కొనుగోలు చేస్తుంటారు. వీధి వీధికో విగ్రహం, పోటా పోటీగా చందాలు, మైకుల మోతలతో హడావుడి కనిపించే ఈ రోజుల్లో.. ఈ ఊరి గ్రామస్థులు మాత్రం కుల మతాలకు అతీతంగా జాతీయోద్యమ స్ఫూర్తితో ఒకే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఐక్యతను చాటుకుంటున్నారు. ఈ గ్రామస్తులు మాత్రం ఈ ఆనవాయితీని నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నారు. ఆ గ్రామం ఎక్కడో లేదు.. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది.

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఊరు.. వాడ తెగ బిజీగా ఉన్నారు. వారు వీరు అంటూ లేదు.. చిన్న పెద్ద అంతా ఆ గణేషుడి పూజలో మునిగి పోతున్నారు. అయితే నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కేశవాపురంలో మాత్రం వాడ వాడన కాకుండా అంతా ఒక్కటిగా ఏకదంతుడికి చవితి పూజలు చేస్తున్నారు. గ్రామస్తులు ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించు కుంటారు. గ్రామంలో కొన్నేళ్లుగా రామాలయం వద్ద గణపతి విగ్రహాన్ని పెట్టి నవరాత్రులు పూజలు చేసేవారు. ఈ పూజల్లో అన్ని కులాలకు చెందిన భక్తులు పాల్గొంటారు. ఎప్పటిలాగానే జాతీయోద్యమ స్ఫూర్తితో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐక్యతను చాటుకుంటున్నారు.
40 ఏళ్ల ఆనవాయితీ.. ఒకే ఒక్క గణపతి..
నాలుగు దశాబ్దాలకు పైగా కేశవాపురంలో ఒక విలక్షణమైన సాంప్రదాయం కొనసాగుతోంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఊరంతా కలిసి గ్రామంలోని రామాలయం వద్ద కేవలం ఒకే ఒక్క గణనాథుడిని ఏర్పాటు చేస్తారు. గ్రామంలో మరే ఇతర వీధిలోనూ, ప్రాంతంలోనూ రెండో విగ్రహాన్ని పెట్టరు.
కులమతాలకు అతీతంగా ఐక్యత..
జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ఈ గ్రామస్తులు ఒకే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గణనాధునికి పూజలు చేస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ఐక్యమత్యాన్ని చాటుతున్నారు. గ్రామంలోని అన్ని కులాలకు చెందిన భక్తులు, ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊరి పెద్దల నుంచి యువకుల వరకు అందరూ కలిసికట్టుగా ఉత్సవాలను నిర్వహించు కుంటారు. లడ్డూ వేలం పాటల నుంచి నిమజ్జనం వరకు అంతా ఒకే కుటుంబంలా కలిసి నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ.
విరాళాలు వద్దు.. మా ఐక్యతే ముద్దు..
వినాయక చవితి ఉత్సవాలకు ఎక్కడైనా విరాళాలు సేకరిస్తుంటారు. కానీ ఈ గ్రామస్తులు మాత్రం విరారాల సేకరణకు వ్యతిరేకం. ఎవరి సహాయం ఆశించకుండా, తమ సొంత నిధులతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ గ్రామం చాటుతున్న ఐక్యతను చూసి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉత్సవాల నిర్వహణకు భారీగా విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే, గ్రామస్థులు ఆ విరాళాలను సున్నితంగా తిరస్కరించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతోనే స్వచ్ఛందంగా పండుగను జరుపుకోవడమే తమకు ఆనందమని గ్రామస్తుల చెబుతున్నారు. విడివిడిగా విగ్రహాలు పెట్టి చందాల కోసం జనాన్ని ఇబ్బంది పెట్టకుండా, అనవసర ఖర్చులను నియంత్రించేందుకే ఏకదంతుడిని ప్రతిష్టిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
కేవలం భజనలు, కోలాటాలు ఆడడం ఇక్కడి ప్రత్యేకత
గ్రామస్తులంతా కలిసి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల డబ్బులు వృథా కాకుండా పర్యావరణం కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎన్ని విగ్రహాలు పెడితే ప్రజల మధ్య దూరం అంత పెరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు భావిస్తున్నారు. జాతీయ ఉద్యమ స్ఫూర్తితో గత 40 ఏళ్లుగా గ్రామంలో ఒకే ఒక గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ, పండుగలు మనుషులను కలపడానికే కానీ విడదీయడానికి కావని ఈ చిన్న పల్లె నినదిస్తోంది. భక్తి శ్రద్ధలతో పాటు సామాజిక బాధ్యతను, ఐక్యమత్యాన్ని చాటుతున్న నల్లగొండ జిల్లా కేశవాపురం గ్రామస్తులు అందరికీ ఆదర్శప్రాయులు.
