AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గర్భం తొలగించేందుకు మాత్రలు.. యువతి మృతి.. యువకుడిపై కేసు..!

Hyderabad: యువతి మృతిచెందిన విషయాన్ని కాకినాడ ఆసుపత్రి వర్గాలు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించాయి. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న నాగసాయిని పోలీసులు సెప్టెంబరు 9నే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శశిధర్‌ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ..

Hyderabad: గర్భం తొలగించేందుకు మాత్రలు.. యువతి మృతి.. యువకుడిపై కేసు..!
Woman Dies
Subhash Goud
|

Updated on: Sep 16, 2026 | 6:41 AM

Share

Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పరిచయమైన యువకుడితో ఏర్పడిన సంబంధం కారణంగా గర్భం దాల్చిన ఓ యువతి.. గర్భాన్ని తొలగించేందుకు అతడు ఇచ్చిన మాత్రలు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే కేపీహెచ్‌బీ ఎస్సై శశిధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతి కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో గత ఆరు నెలలుగా పనిచేస్తోంది. ఆమె సర్దార్‌ పటేల్‌నగర్‌లోని ఓ వసతిగృహంలో ఉంటోంది. అదే వసతిగృహంలో ఉంటున్న కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన ఆరెపు నాగసాయి (26)తో ఆమెకు ఆమె స్నేహితుడు వెంకట్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. నాగసాయికి ఇప్పటికే వివాహమై ఓ కుమార్తె ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

సుమారు ఐదు నెలల క్రితం నాగసాయి, యువతి మధ్య ఏర్పడిన పరిచయం లైంగిక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. గర్భం తొలగించేందుకు నాగసాయి ఆమెకు మాత్రలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. అయితే ఆ మాత్రలు వికటించడంతో యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది.

పరిస్థితి విషమించడంతో వసతిగృహంలోని సహచరులు ఆగస్టు 26న నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు, ఆగస్టు 27న యువతి మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు అధిక ఖర్చు అవుతుండటంతో కుటుంబసభ్యులు సెప్టెంబరు 1న ఆమెను కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో సెప్టెంబరు 14న యువతి మృతిచెందింది.

యువతి మృతిచెందిన విషయాన్ని కాకినాడ ఆసుపత్రి వర్గాలు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించాయి. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న నాగసాయిని పోలీసులు సెప్టెంబరు 9నే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శశిధర్‌ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us