AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 గ్రాముల గంజాయి విక్రయించబోయి.. రూ.1.50 కోట్ల గంజాయి సాగు గుట్టురట్టు!

11 గ్రాముల ఎండు గంజాయితో పట్టుబడిన వ్యక్తిని పోలీసులు విచారించగా.. ఏకంగా 10 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాపూర్‌ శివారులో అంబురే పుండలిక్‌ సాగు చేస్తున్న చేలో సుమారు 1500 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఎండు గంజాయితో కలిపి దాదాపు రూ.1.50 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ నితికాపంత్‌ తెలిపారు..

11 గ్రాముల గంజాయి విక్రయించబోయి.. రూ.1.50 కోట్ల గంజాయి సాగు గుట్టురట్టు!
Cannabis Farm Adilabad
Srilakshmi C
|

Updated on: Sep 16, 2026 | 9:23 AM

Share

ఆదిలాబాద్‌, సెప్టెంబర్ 16: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో భారీగా గంజాయి సాగు వెలుగులోకి వచ్చింది. కేవలం 11 గ్రాముల ఎండు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడటంతో.. విచారణలో ఏకంగా 10 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోట గుట్టు రట్టయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నితికా పంత్‌ సోమవారం జైనూర్‌ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పట్నాపూర్‌ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో జైనూర్‌ ఎస్సై రవికుమార్‌ ఆదివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అంబురే పుండలిక్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద 11 గ్రాముల ఎండు గంజాయి లభించింది. నిందితుడిని పోలీసులు విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు అధికారులు తెలిపారు. తనకు గంజాయి అలవాటు ఉందని, మిగిలిన గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. గతంలో కొంత గంజాయి సాగు చేశానని కూడా వెల్లడించాడు. అతడి సమాధానాలపై అనుమానం వచ్చిన పోలీసులు నిందితుడిని వెంట తీసుకుని పట్నాపూర్‌ శివారులోని అటవీ ప్రాంతం మీదుగా దాదాపు 10 కిలోమీటర్లు కాలినడకన అతడి చేనుకు వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి పోలీసులు విస్తుపోయారు. ఏకంగా 10 ఎకరాల్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు.

గంజాయిని అంతర పంటగా కంది, పత్తి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సుమారు 1500 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయి, మొక్కల విలువ సుమారు రూ.1.50 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో అంబురే పుండలిక్‌తో పాటు అతడి కుమారుడు రమేశ్, అల్లుడు బిస్సే మాధవ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సాగు, విక్రయాలకు సంబంధించి మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Follow Us