కవ్వాల్ కిలకిలలు.. వలసొస్తున్న విదేశీ పక్షులు! ఆకట్టుకుంటున్న బర్డ్ ఫెస్టివల్
కవ్వల్ అభయారణ్యంలో బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వలస పక్షుల అధ్యయనం, పక్షి జాతుల వైవిధ్యం, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ బర్డ్ ఫెస్టివల్ సాగుతోంది. విద్యార్థులు, పక్షి ప్రేమికులు పాల్గొన్నారు. వందలాది రకాల పక్షులు, వాటిని వీక్షించే అవకాశం లభించింది. అటవీశాఖ అధికారులు పక్షుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతంలో పక్షి వైవిధ్యం, సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చేపట్టిన బర్డ్ ఫెస్టివల్ రెండో రోజుకు చేరింది. మంచిర్యాల జిల్లాలోని చెరువులు కుంటలు వలస పక్షులకు నెలవుగా మారుతున్నాయి. జీవవైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్న పక్షుల అధ్యయనం కోసం మంచిర్యాల అటవిశాఖ జిల్లాలో బర్డ్ ఫెస్టివల్ చేపట్టింది. మార్చి 1, 2 తేదీల్లో రెండు రోజులుగా చేపట్టిన బర్డ్ పెస్టివల్ కు మంచి స్పందన లభిస్తోంది. వలస పక్షుల అధ్యయనం కోసం పక్షి ప్రేమికులు వందలాదిగా తరలి వస్తున్నారు. విద్యార్థులు సైతం ఉత్సాహంగా పక్షి పండుగలో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు.
తొలిరోజులో భాగంగా బర్డ్ వాక్ ఫెస్ట్, వర్క్ షాపులు ఆకట్టుకోగా.. విద్యార్థుల విజిట్ టూర్ తో గాంధారి వనం , బొక్కల గుట్ట ప్రాంతాలు సందడిగా మారాయి. పక్షులను వీక్షించడానికి తిప్పేశ్వర్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి అటవీ అధికారులు ఇక్కడికి తరలి వచ్చారు. మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారివనం, గాంధారి ఖిల్లాలో అటవీశాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఫెస్టివల్లో మంచిర్యాలకు చెందిన కస్తూర్బా పాఠశాల, ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ రోజులో భాగంగా లక్షేట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ శివారులో ఉన్న చెరువును సందర్శించారు అటవిశాఖ ఉన్నతాదికారులు, పక్షి శాస్త్రవేత్తలు. పక్షుల కిలకిలరావాలతో కనువిందు చేస్తూ కనిపిస్తున్న వెంకట్రావ్ పేట్ చెరువును తమ కెమెరాల్లో బందించారు పక్షి ప్రేమికులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రకరకాల పక్షులు ఈ చెరువు వద్దకు వలస వస్తుండడంతో వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ ఆదేశాలు జారీ చేశారు.
వలస పక్షులపై అధ్యయనం చేస్తున్న పక్షుల నిపుణులు బైనాక్యూలర్తో పక్షులను వీక్షిస్తూ వాటిని కెమెరాల్లో బందిస్తూ వాటి వివరాలు తెలుసుకున్నారు. పక్షులు జీవవైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్నాయని.. పక్షుల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు పీసీసీఎఫ్ సువర్ణ. బర్డ్ ఫెస్టివల్ వర్క్ షాప్లు పక్షుల అధ్యయానికి మరెంతగానో దోహదపడుతాయని తెలిపారు. కవ్వాల్ అభయారణ్యం రక్షిత అడువులు, నదుల తీరాలు అరుదైన పక్షి జాతులకు ఆవాసంగా మారాయని… గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా తీరప్రాంతాల్లోకి విదేశీ వలస పక్షులు వేలాదిగా తరలి వస్తున్నాయని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు మంచిర్యాల డిఎప్వో శివ్ ఆశీష్ సింగ్. ఇప్పటి వరకు కవ్వాల్ అభయారణ్యంలోకి 132 పైగా పక్షి జాతులు వలస వచ్చాయని.. రష్యా, మంగోలియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వియత్నాం లాంటి సుదూర ప్రాంతాల నుంచి పక్షులు కవ్వాల్ అభయారణ్యం లోకి వలస వస్తున్నట్లు గుర్తించామన్నారు. లక్షేట్టిపేట మండల వెంకట్రావ్ పేట్ చెరువు వలస పక్షుల తో దేశ పటం లో ప్రత్యేక చోటు సంపాదించుకోనుందని డీఎప్వో తెలిపారు.
కవ్వాల్ అభయారణ్యాలు జీవవైవిధ్యానికి ఆలవాలంగా మారడంతో కాగజ్ నగర్ నుండి మొదలు లక్షేట్టిపేట వరకు 132 కి పైగా విదేశీ పక్షులు క్యూ కట్ట్టాయని.. అందులో ఫారెస్ట్ వాగెయిల్, బ్లాక్ బజా, లగర్ ఫాల్కన్, డస్కీ ఈగల్ ఔల్, స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్, స్మాల్ ప్రాటిన్కోల్, రెడ్ క్రస్టెడ్ పోచార్డ్స్, కామన్ కింగ్ ఫిషర్, బ్లాక్ షోల్డర్డ్ కైట్, లీసర్ ప్లాంబాకక్ ఉడ్పికర్, ఓరియంటల్ హనీ బజర్డ్, ఇండియన్ కార్మోరన్ట్, స్పాటెడ్ ఔల్ట్, కామన్ హూప్, బ్రౌన్వుడ్ త్రైక్, ఆశిక్రౌన్డ్ స్పారో లార్క్, ఎల్లో ఫ్రూటెడ్ గ్రీన్ పిజియన్, కామన్ హాక్ కుకూ, శిక్గా, చాంగెబ్ హాక్ ఈగల్, పైడ్ కింగ్ ఫిషర్, వైట్ ఐ బజర్డ్, సినిరియస్ టిట్, వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్, అలెగ్జాండ్రిన్ ప్యారకిట్, ఓరియంటల్ డార్టర్, బ్లాక్ హెడెడ్ హైబీస్, రివర్ టర్న్ లాంటి మేలైన పక్షి జాతులు ఉన్నాయని అటవిశాఖ అధికారులు తెలిపారు. రాబోయే కాలంలో కవ్వాల్ పక్షుల ఖిల్లాగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు అటవిశాఖ అదికారులు.