Telangana Formation Day: స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం.. తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుందిలా..!
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న అప్పటి ఏపీ శాసనసభ ఉపసభాపతి కల్వకుంట్ల..
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్‌ఎస్) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27న అప్పటి ఏపీ శాసనసభ ఉపసభాపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన పదవికి, శాసన సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కొందరి నేతలతో టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం. నిధులు, నీళ్లు, నియామకాలు అనే పేరుతో ప్రారంభమైన ఉద్యమ పార్టీ తన 14వ ఏటా లక్ష్యాన్ని సాధించింది. దీంతో టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీడీపీతో పాటు తన పదవులకు రాజీనామా చేస్తూ టీఆర్‌ఎస్ పార్టీని ప్రారంభించారు. అదే ఏడాది జులైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సానుకూల ఫలితాలు సాధించారు. ఇక కేసీఆర్ 2001లో జరిగిన సిద్ధిపేట ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చినట్లయింది.
కాంగ్రెస్‌తో పొత్తు..
ఇక 2004లో ఏపీ అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్.. 26 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్రంలో మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినా, ప్రణబ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఎటు తేల్చకపోవడంతో రాష్ట్రంలో ఆరుగురు టీఆర్‌ఎస్ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలిగారు. ఇక వరంగల్, పోలవరంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి శరద్‌పవర్, శిబు సోరెన్ వంటి నేతలను ఆహ్వానించారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారింది.
ఎంపీగా కేసీఆర్ రాజీనామా
తెలంగాణ ఏర్పాటులో భాగంగా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అందుకు నిరసనగా కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2006 డిసెంబర్‌లో కరీంనగర్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో కేసీఆర్ రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా వ్యూహాలు రచించారు.
2009లో..
2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలో కూటమితో టీఆర్‌ఎస్ పొత్తుకుదుర్చుకుని మంచి ఫలితాలు సాధించింది. కేవలం పదిమంది ఎమ్మెల్యేలతో పాటు మహబూబ్‌నగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి విజయశాంతి టీఆర్‌ఎస్ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్నిటీఆర్‌ఎస్ నేత కేసీఆర్ ఉద్యమం దిశగా మలిచారు. 2009 అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన ద్వారా తిరిగి ప్రజల్లో ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్ పార్టీ కీలకంగా ముందుకెళ్లింది.
తెలంగాణ బిల్లుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2013 అక్టోబర్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 డిసెంబర్ 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 63, 11లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాల్లో గెలుపొంది రెండో సారి అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆమరణ దీక్షతో కొత్త మలుపు
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేసేందుకు కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు మార్గమద్యంలో అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో కోదండరామ్ చైర్మన్‌గా జేఏసీని ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో ముఖ్యపాత్ర పోషించారు. 2010 డిసెంబర్ 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్ తలపెట్టిన మహా గర్జనకు 20 లక్షల మంది వరకు హాజరు కావడం ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తరర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొత్తం మీద రాష్ట్ర స్థాపనే ధ్యేయంగా పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.