Job Fraud: భాగ్యనగరంలో ఘరానా మోసం.. రూ.24 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జాగృతి కన్సల్టెన్సీ
ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం.. ఆపై మనీ చేతికి అందగానే బోర్డు తిప్పేయడం కామన్ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి మోసమే హైదరాబాద్‌లో మరొకటి వెలుగు చూసింది. ఉద్యోగాల ఆశ చూపి.. ఓ ఐటీ కన్సల్టెన్సీ రూ. 24కోట్లకు కుచ్చుటోపీ పెట్టడంతో లబోదిబోమంటున్నారు నిరుద్యోగులు..
ఈ మధ్య కాలంలో నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం.. ఆపై మనీ చేతికి అందగానే బోర్డు తిప్పేయడం కామన్ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి మోసమే హైదరాబాద్‌లో మరొకటి వెలుగు చూసింది. ఉద్యోగాల ఆశ చూపి.. ఓ ఐటీ కన్సల్టెన్సీ రూ. 24కోట్లకు కుచ్చుటోపీ పెట్టడంతో లబోదిబోమంటున్నారు నిరుద్యోగులు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జాగృతి కన్సల్టెన్సీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఉద్యోగాలు ఇస్తాం.. ఉద్యోగాలు ఇప్పిస్తాం.. అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసిన జాగృతి కన్సల్టెన్సీ. నమ్మి వచ్చినవారిపై కుట్ర అమలు చేసింది. ఉద్యోగం ఊరికే రాదు.. 2 లక్షల రూపాయల డిపాజిట్ చేయాలని కండీషన్ పెట్టింది. ఐటీ కంపెనీలో ఉద్యోగమనే ఆశతో 1200 మంది నిరుద్యోగులు.. ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు కట్టారు. అయితే.. రూ. 2 లక్షలు కట్టినోళ్లకు ఫేక్ ఆఫర్ లెటర్స్‌తో ఉద్యోగాలు ఇచ్చింది.
అట్టహాసంగా ఆఫీసు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చిన కన్సల్టెన్సీ, జీతాలు మాత్రం ఇవ్వడం మానేసింది. అంతే.. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కంపెనీని నిలదీశారు ఉద్యోగులు. జీతాలు అయినా ఇవ్వండి లేకుంటే తాము కట్టిన 2 లక్షల రూపాయలు అయినా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, పరిస్థితులు చేయి దాటడంతో రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసింది జాగృతి కన్సల్టెన్సీ. 1200 మంది నుంచి 24 కోట్ల రూపాయలు వసూలు చేసి జాగృతి కన్సల్టెన్సీ డైరెక్టర్ జగదీశ్ మోసం చేశారని బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు.. ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాక.. ప్రశ్నించినవారిని కేసుల్లో ఇరికించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుకుందామని ఇంటికి పిలిచిన వాకాటి రవిచంద్రారెడ్డి.. కిడ్నాప్ డ్రామా ఆడారని బాధితులు ఆరోపించారు. తప్పుడు కేసులు పెడుతున్న రవిచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…