Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ జయంతి నాడు డబుల్ ధమాకా.. ఒక్కొక్కరికి..
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పథకానికి శ్రీకారం చుట్టింది. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు రెండు చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇది మహిళల సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో మహిళా సంక్షేమం, చేనేత రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా మహ మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు.
బతుకమ్మ స్థానంలో ఇందిరమ్మ
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరలు పథకానికి బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరలు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి మహిళకి రెండు చీరలు ఉచితంగా అందజేస్తారు. గత ఏడాది ఆగస్టు 7న జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఒక్కో చీరకు ప్రభుత్వం రూ.480 కేటాయించింది. ఇది గతంలో బతుకమ్మ చీరల పథకానికి ఖర్చు చేసిన రూ.350 కంటే ఎక్కువ కావడం గమనార్హం.
వాయిదాకు కారణాలు
ఈ చీరల పంపిణీని మొదట అక్టోబర్‌లో బతుకమ్మ, దసరా పండుగల సమయంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లు జారీ చేయడం, ఆ వెంటనే హైకోర్టు రిజర్వేషన్లను నిలిపివేయడంతో ఎన్నికలు రద్దవడం వంటి పరిణామాల కారణంగా పంపిణీ వాయిదా పడింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవడంతో పార్టీలన్నీ దీనిపైనే ఫోకస్ పెట్టాయి. ఈ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పంపిణీని చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
పంపిణీ.. లబ్ధిదారులు
ఇందిరమ్మ చీరల పథకం కింద.. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో చీరలు పంపిణీ జరుగుతంది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4.35 లక్షల SHG బృందాలు, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1.70 లక్షల SHG బృందాలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 64.69 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పంపిణీ సజావుగా జరిగేందుకు అవసరమైన స్టాక్‌ను ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల్లోని గోడౌన్స్‌కు తరలించింది.
చేనేతకు చేయూత
ఈ చీరలను రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని చేనేత కార్మికుల సంఘాలు ఇందిర మహిళా శక్తి చొరవ కింద ఉత్పత్తి చేస్తున్నాయి. సిరిసిల్ల మాత్రమే దాదాపు 131 నేత యూనిట్లు ఉత్పత్తి ఆర్డర్‌లను పొందాయి. మొత్తంగా, ఈ ఆర్డర్ కోసం 4.24 కోట్ల మీటర్ల ఫాబ్రిక్ అవసరమవుతుంది. ఈ ఉత్పత్తి ప్రక్రియలో దాదాపు 6,900 మంది నేత కార్మికులు పాల్గొంటున్నారు. ఈ చొరవ చేనేత రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మంది ఉన్న మహిళలతో దాని అనుబంధాన్ని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
