AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇది కదా కావాల్సింది.. నిరుద్యోగులకు పండుగలాంటి వార్త చెప్పిన రేవంత్ సర్కార్

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. రూ.13,819 కోట్ల పెట్టుబడులతో తెలంగాణ టూరిజం రంగానికి భారీ ఊపు రానుంది. అలాగే 18 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కలగానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: ఇది కదా కావాల్సింది.. నిరుద్యోగులకు పండుగలాంటి వార్త చెప్పిన రేవంత్ సర్కార్
Jobs
Prabhakar M
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 13, 2025 | 10:33 AM

Share

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త టూరిజం పాలసీ పెట్టుబడిదారుల్లో అపూర్వమైన స్పందనను రాబడుతోంది. రాష్ట్రం వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకోగా, పాలసీ అమల్లోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే రూ.13,819 కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 17,960 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనున్నది. టూరిజం రంగంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తోంది. పీపీపీ మోడ్‌లో ఇప్పటికే 14 ప్రాజెక్టులకు రూ.7,081 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. అదనంగా, ప్రైవేట్ మోడల్‌లో చేపట్టనున్న మరో 17 ప్రాజెక్టులకు రూ.6,738 కోట్ల పెట్టుబడులు రావడానికి అవకాశముంది. ఈ రెండు భాగాలలో మొత్తం 18 వేల మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయని ప్రభుత్వం చెబుతోంది.

వికారాబాద్, అనంతగిరి, అమ్రాబాద్, సోమశిల, బుద్ధవనం వంటి పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి రిసార్టులు, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ సెంటర్లు, వెడ్డింగ్ డెస్టినేషన్లు, థీమ్ పార్కులు వంటి పెద్ద ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అనంతగిరిలో జేసామ్–జెన్ మేఘా జేవీ ద్వారా వెల్నెస్ సెంటర్, వైన్ మేకింగ్ యూనిట్, గింజర్ హోటల్ నిర్మాణం జరగనుంది. మేఘా ఇంజనీరింగ్ రూ.1,021 కోట్లతో లా వీ వెల్నెస్ రిట్రీట్‌ను నిర్మిస్తోంది. బుద్ధవనం పరిసరాల్లో వెల్ల్నెస్, వెడ్డింగ్ డెస్టినేషన్ ప్రాజెక్టులు ఆకర్షణీయంగా మారనున్నాయి. థైవాన్‌కు చెందిన ఫోగువాంగ్ షాన్ సంస్థ అక్కడ పలు అభివృద్ధి పనులకు ముందుకొచ్చింది. సోమశిలను బ్యాక్‌వాటర్ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల ఎకోటూరిజం, ట్రైబల్ సాంస్కృతిక ప్రాజెక్టులు ప్రణాళికల్లో ఉన్నాయి.

ఇక హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ప్రముఖ అంతర్జాతీయ హోటల్ చైన్లు భారీ పెట్టుబడులతో అడుగుపెడుతున్నాయి. ప్రెస్టీజ్ గ్రూప్ రాయదుర్గంలో ఒబెరాయ్‌తో 5 స్టార్ హోటల్, బుద్వెల్లో సెయింట్ రెజిస్, అలాఫ్ట్ హోటల్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. పుష్పలగూడలో హిల్టన్ భాగస్వామ్యంతో 5 స్టార్ హోటల్, శంషాబాద్‌లో గ్రాండ్ హయత్, నియోపోలిస్‌లో ఇంటర్కాంటినెంటల్ హోటల్ నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. సినిమా టూరిజానికి కూడా తెలంగాణ పెద్ద ప్రోత్సాహం ఇస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీ 600 ఎకరాల్లో రూ.2,000 కోట్లతో కొత్త ఆకర్షణలను ఏర్పాటుచేస్తోంది. మాస్టా స్టూడియోస్ రూ.550 కోట్లతో ‘బాహుబలి థీమ్ పార్క్’ను నిర్మించనుంది. కోటిపల్లి వద్ద తాజ్ సఫారీతో ఎకో రిసార్ట్ కూడా అభివృద్ధి అవుతోంది.

శంషాబాద్‌లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, అనంతగిరిలో జెడబ్ల్యూ మారియట్ రిసార్ట్, చిలుకూరు సమీపంలో 5 స్టార్ రిసార్ట్ మరియు కన్వెన్షన్ సెంటర్ వంటి ప్రాజెక్టులు కూడా టూరిజం రంగానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఈ భారీ పెట్టుబడులతో తెలంగాణ టూరిజం రంగం అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెంది, రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్‌పై కొత్త గమ్యస్థానంగా మార్చే అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి.