AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: ఫిబ్రవరిలో పీక్‌ లెవెల్‌కు తెలంగాణా పొలిటికల్ హీట్.. పోటాపోటీ సభలకు సిద్దమవుతున్న బిజెపి, బిఆర్ఎస్

తెలంగాణలో కొనసాగుతున్న పొలిటికల్ హీట్ ఫిబ్రవరి నెలలో నెక్స్ట్ లెవెల్ కి చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని గట్టిగా పంతం పట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యర్థి వ్యూహాలకు.. ప్రతి వ్యూహాలు రచిస్తూ పొలిటికల్ హీట్‌ను..

Telangana Politics: ఫిబ్రవరిలో పీక్‌ లెవెల్‌కు తెలంగాణా పొలిటికల్ హీట్.. పోటాపోటీ సభలకు సిద్దమవుతున్న బిజెపి, బిఆర్ఎస్
Telangana Politics
Rajesh Sharma
|

Updated on: Jan 24, 2023 | 8:43 PM

Share

తెలంగాణలో కొనసాగుతున్న పొలిటికల్ హీట్ ఫిబ్రవరి నెలలో నెక్స్ట్ లెవెల్ కి చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదని గట్టిగా పంతం పట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యర్థి వ్యూహాలకు.. ప్రతి వ్యూహాలు రచిస్తూ పొలిటికల్ హీట్‌ను మరింత రాజేస్తున్నారు. ఫిబ్రవరిలో కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత ఏ క్షణమైనా అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల దిశగా అడుగులు వేసే అవకాశాలను ఒక వైపు పరిశీలిస్తూనే.. ఇంకోవైపు బిజెపిని ధీటుగా ఎదుర్కొనేందుకు కేసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను, బిజెపి రాజకీయాలను తన ప్రసంగాలలో హైలైట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలను వరుసగా ప్రారంభిస్తూ వస్తున్నారు. పాత జిల్లా కేంద్రాల్లోనూ పాతబడిపోయిన కలెక్టరేట్ భవనాలను మూసివేసి లేదా కూల్చివేసి కొత్త సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన కరెక్టరేట్ భవన సముదాయాన్ని కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్లతో ప్రారంభింప చేశారు కేసీఆర్. అక్కడే నిర్వహించిన భారీ బహిరంగ సభలో జాతీయస్థాయిలో చర్చకు రావాల్సిన అంశాలను లేవనెత్తారు గులాబీ బాస్. నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైభల్యం చెందిందని ఆరోపిస్తూనే తాము కొత్తగా ప్రారంభించిన జాతీయ పార్టీ సారథ్యంలో ఏఏ అంశాలపై దృష్టి సారిస్తామనే అంశాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

పోటాపోటీ సభలకు ప్లాన్

ఖమ్మం సభ తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించారు కేసీఆర్. ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఆరు రోజులపాటు నిర్వహించి బడ్జెట్‌కు ఆమోదం పొందాలని ప్లాన్ చేశారు. ఈ తంతు ముగిసిన వెంటనే భారత రాష్ట్ర సమితి విస్తరణ కార్యక్రమాలపై కేసీఆర్ దృష్టి సారిస్తారని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఆలోచన వెనుక కేసీఆర్ వ్యూహం క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమాన్ని రాజకీయంగా కూడా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సభ నిర్వహణకు కమల నాధులు పూనుకున్నారు. వేలాది కోట్ల రూపాయలతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ సభకు సన్నాహాలు

ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పడిన తర్వాత తెలంగాణకు జరిగిన ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు వివరించాలని సంకల్పించారు బిజెపి నేతలు. దీనికి కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్న భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ ఫిబ్రవరి 17వ తేదీన జరగనున్న సచివాలయ ప్రారంభోత్సవాన్ని అందుకు వినియోగించుకోవాలని తలపెట్టారు. దానికి అనుగుణంగానే పరేడ్ గ్రౌండ్స్‌లో బిజెపి సభను తలదన్నేలా మరింత అధికంగా జన సమీకరణ చేయడం ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులతో పాటు చుట్టుపక్కల నాలుగు జిల్లాల మంత్రులను అప్రమత్తం చేసి ఇప్పటినుంచే జన సమీకరణ దిశగా చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. ఖమ్మం సభ మాదిరిగానే ఫిబ్రవరి 17న జరగనున్న పరేడ్ గ్రౌండ్స్ సభకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను.. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీని వ్యతిరేకించే నేతలను ఆహ్వానించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

దీదీకి ఆహ్వానం?

మమతా బెనర్జీ తోపాటు మరో ముఖ్యమంత్రిని కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయని భారత రాష్ట్ర సమితి వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ కేసీఆర్ పుట్టినరోజు కూడా. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీని వ్యవహరించే తీయ స్థాయి నేతల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తన పుట్టినరోజున నిర్వహించనున్న మహా బహిరంగ సభ వేదికగా ప్రధాన మంత్రికి సవాళ్లు విసరాలని గులాబీ బాస్ తలపెట్టారు. నిజానికి ఖమ్మం సభ తర్వాత ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో.. ఆ తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి సభలను నిర్వహించాలని తొలుత కేసిఆర్ భావించారు. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచడంతో ఎక్కడికక్కడ కమలనాధులను కట్టడి చేయాలన్న సంకల్పంతో పరేడ్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 17వ తేదీన మహా భారీ బహిరంగ సభను నిర్వహించాలని అనూహ్యంగా నిర్ణయించారు.

పీక్‌లెవెల్‌కి పొలిటికల్ హీట్

ఫిబ్రవరి మొదటి వారంలో అటు కేంద్ర బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజల ముందుకు రానున్నాయి. ఎన్నికల సంవత్సరం కాబట్టి సహజంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సంక్షేమానికి తామెంతగా ప్రాధాన్యత ఇస్తున్నామో చాటుకునేందుకు అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. బడ్జెట్లు సభల ముందుకు వచ్చాయో లేదో ఆ వెంటనే రాజకీయపరంగా బడ్జెట్ అంశాలను ప్రచారం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి నేతలు కూడా సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 13వ తేదీన జరగనున్న సభలో బిజెపి నేతలు, ఫిబ్రవరి 17వ తేదీన జరగనున్న సభలో బిఆర్ఎస్ నేతలు కచ్చితంగా ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో గత ఏడాదిన్నర కాలంగా బిజెపి, బిఅర్ఎస్ పార్టీల మధ్య పెరిగిన రాజకీయ వైరానికి మరింత ఆజ్యం పోసే దిశగా ఇరు పార్టీల నేతల ప్రసంగాలు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ అన్ని అంశాలను విశ్లేషించుకుంటే ఫిబ్రవరి 2, 3 వారాల్లో తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్ లెవెల్‌కి చేరే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..